మీ-టు ఉచ్చులో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు ఎంజే అక్బర్. కాస్టింగ్ కౌచ్ ఆరోపణల వల్ల ఏకంగా తన మంత్రిపదవి కూడా పోగొట్టుకున్నారు. ఓవైపు ఈ వివాదం చెలరేగుతుండగానే, ఈ మాజీమంత్రిపై మరో వివాదం ముసురుకుంది. ఈసారి పల్లవి గొగోయ్ అనే మహిళ ఆరోపణలు చేసింది. అక్బర్ ఏకంగా తనను రేప్ చేశాడని ఆమె ఆరోపించడం గమనార్హం.
వాషింగ్టన్ పోస్ట్ కు రాసిన సుదీర్ఘమైన లేఖలో ఈ మహిళా జర్నలిస్ట్ తన ఆవేదన మొత్తం బయటపెట్టారు. మీ-టు ఉద్యమం వల్ల ఇన్నాళ్లకు తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టే అవకాశం వచ్చిందని తెలిపిన పల్లవి.. తనకు, అక్బర్ కు మధ్య జరిగిన ఎన్నో ఘటనల్ని పూసగుచ్చినట్టు బయటపెట్టారు.
20 ఏళ్ల కిందట ఏషియన్ ఏజ్ లో అక్బర్ ఎడిటర్ గా ఉన్న సమయంలో తను అతడితో కలిసి పనిచేశానని తెలిపిన పల్లవి.. అక్బర్ తనను లొంగదీసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడని ఆరోపించారు. ముంబయి, ఢిల్లీలో జరిగిన వివిధ వేధింపుల ఘటనల నుంచి తను తప్పించుకున్నానని, కాని జైపూర్ లోని ఓ హోటల్ లో మాత్రం దొరికిపోయానని చెప్పుకొచ్చింది. ఆరోజు హోటల్ లో అక్బర్ తనను అత్యాచారం చేశారని ఆరోపించింది.
ఆశ్చర్యకరంగా ఈసారి అక్బర్ ఈ ఆరోపణల్ని తిప్పికొట్టలేదు. తనకు పల్లవికి మధ్య బంధాన్ని అంగీకరించారు. తను, పల్లవి కొన్నాళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్నామని, ఆ విషయం ఆఫీస్ లో అందరికీ తెలుసంటున్నారు అక్బర్. కొన్ని నెలల పాటు తామిద్దరం కలిసిమెలిసి తిరిగామని, పరస్పర అంగీకారంతో ఓ బంధాన్ని కూడా కొనసాగించామని అంటున్నారు అక్బర్. ఆ తర్వాత ఆ బంధం వీగిపోయిందని, ఇన్నేళ్లకు పల్లవి ఇలా ఆరోపణలు చేయడం ఏం బాగాలేదంటున్నారు.
ఈసారి అక్బర్ కు, ఆమె భార్య మల్లిక నుంచి కూడా మద్దతు లభించింది. పల్లవి, అక్బర్ మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి తనకు కూడా తెలుసని ప్రకటించారు మల్లిక. తన ముందే అక్బర్ ను పల్లవి గట్టిగా వాటేసుకునేదని, అర్థరాత్రిళ్లు కాల్స్ కూడా చేసేదని చెప్పుకొచ్చారు. తర్వాత కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తూ అక్బర్, పల్లవికి దూరమయ్యారని చెప్పుకొచ్చారు.
వాదప్రతివాదనలు పక్కనపెడితే, అక్బర్ పై ఇలా మరోసారి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు రావడం మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాబోయే రోజుల్లో ఇంకెంతమంది మహిళా జర్నలిస్టులు అక్బర్ కు వ్యతిరేకంగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తారో చూడాలి.
చిలక.. 'ఛీ'బీఐ.. భళా మోడీ భళా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ లో