రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దని 70 రోజులకు పైగా పోరాటం చేస్తున్నా ఇతర ప్రాంతాల నుంచి, బాబు సామాజికవర్గం మినహా మిగిలిన వాళ్ల నుంచి ఎందుకు మద్దతు రాలేదనే ప్రశ్నకు ఇంత కాలానికి జవాబు దొరికింది. రాజధాని ప్రాంతంలో 54,307 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ 1,251 ఎకరాలను జగన్ సర్కార్ కేటాయించింది. రాజధానిలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపును వ్యతిరేకిస్తూ హైకోర్టుకెక్కారు.
రాజధాని ప్రాంతంలో ఇతర మండలాలకు చెందిన వారికి భూములివ్వడం సరి కాదని, ఇది సీఆర్డీఏ చట్ట నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. అలాగే రైతులు భూములిచ్చింది రాజధాని కోసమని, ఇళ్లస్థలాల కోసం కాదన్నారు. భూసమీకరణ సమయంలో ఆ భూముల్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు దాని నుంచి తప్పుకొనేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు.
ఇక్కడ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వాళ్ల నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఆశిస్తున్నాం. రాజధాని ప్రాంతంలో ఇతర మండలాల వారికి భూములివ్వడం సరికాదంటున్నారే…మరి దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలకు మాత్రం రాజధానిలో భూములివ్వడం సరైందా? కనీసం తల దాచుకునేందుకు ఒక సెంట్ భూమి ఇచ్చి, ఇల్లు కట్టిస్తే నేరమా? రాజధాని అంటే మనుషులు కాదా? మీ దృష్టిలో మనుషులంటే కేవలం డబ్బున్న వాళ్లేనా? రాజధాని అంటే కేవలం పరిశ్రమలేనా? భూముల్ని అభివృద్ధి చేయడం అంటే రియల్ ఎస్టేట్ వ్యవహారమేనా?
ఇతర మండలాల పేదలకు రాజధానిలో ఇంటి స్థలాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న మీరు, మీ పోరాటానికి మద్దతు ఇవ్వాలని రాష్ట్రమంతా చంద్రబాబును వెంటేసుకుని జోలె ఎలా పట్టారు? ఎందుకు పట్టారు? రాజధానిలో నిరుపేదలంటనే… మురికివాడల ప్రదేశం గుర్తుకొస్తుందా? పేదలపై మీకింత ఏహ్య భావమా?
విజయవాడ సిటీతో పాటు మీ సమీప మండలాల పేదలంటే ప్రేమించక పోవడం వల్లే, మీ ఉద్యమానికి ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదనే విషయాన్ని గ్రహించారా? ఎంతసేపూ మీ ప్రయోజనాలు తప్ప, పక్కవాడి యోగక్షేమాలను పరిగణలోకీ తీసుకోకపోవడం వల్లే కదా, వాళ్లు కూడా మిమ్మల్ని అభిమానించలేక పోతున్నారు. ఇది వాస్తవం కాదా? పేదలకు స్థలాల ఇవ్వకూడదంటూ సీఆర్డీఏ చట్టం చెబుతోందని న్యాయ పాఠాలు వల్లె వేస్తున్న మీకు…మీ పోరాటం దగ్గరికి వచ్చేసరికి అందరూ మద్దతు ఇవ్వాలి? ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి మానవత్వం?