ఒకవైపు ప్రపంచపు అగ్రరాజ్యాధినేతను రాష్ట్రపతి నివాసంలో సత్కరిస్తూ.. విందు ఆరగింపజేస్తూ.. దేశవ్యాప్తంగా అన్ని మూలలనుంచి తరలివచ్చిన అత్యంత ప్రముఖులతో కోలాహలంగా విందులు చేసుకుంటున్న వేళ.. దేశరాజధాని తగలబడిపోతూ ఉంది! మోడీ ఆహ్వానం మేరకు వచ్చాడు గనుక… తన దేశపు ఎన్నికల్లో మోడీ ప్రాభవంతో తనకు కూడా అవసరం ఉన్నది గనుక… తాను ఒక అంచున తిరుగుతూ ఉంటే.. అదే నగరంలో మరొక అంచున రేగిన అల్లర్లు మారణకాండ గురించి పల్లెత్తు మాట్లాడకుండా ట్రంప్ ‘అది భారత్ అంతర్గత వ్యవహారం’ అనే మాట చెప్పేసి వెళ్లిపోయారు. కానీ స్వదేశీ నాయకులు అలా సింపుల్ గా తప్పించుకోవడానికి వీల్లేదు. వారు ఈ గొడవల గురించి మాట్లాడి తీరాల్సిందే.
దిల్లీలో జరుగుతున్న అల్లర్లపై కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ అత్యవసర సమావేశం నిర్వహించింది. చాలా రోజులుగా అచేతనంగా ఉన్న పార్టీ కనీసం ఈ విషయంలోనైనా సకాలంలో స్పందించింది. దేశ హోం మంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని సోనియా డిమాండ్ చేశారు. ఈశాన్య ఢిల్లీ అల్లర్లు పూర్తిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యమేనని సోనియా నిందించారు.
సోనియా మాటల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. రెండు ప్రభుత్వాల వైఫల్యాలే.. ఇవాళ దేశరాజధానిలో అల్లర్లు దేశానికే తలవంపులు తెచ్చే పరిస్థితిని కల్పిస్తున్నాయి. అమిత్ షా రాజీనామా చేయడం సంగతి తర్వాత.. కనీసం ప్రజలనుద్దేశించి తన జవాబుదారీతనం గురించి మాట్లాడుతున్నారా? అంటే అది కూడా లేదు. అజిద్ ఢోబాల్ చేతిలో వ్యవహారాన్ని పెట్టేసి కమలదళాలన్నీ నిమ్మళంగా కూర్చున్నాయి. సోదరభావంతో మెలగండి.. శాంతి భద్రతలు కాపాడేందుకు కృషి చేయండి అని పడికట్టు పదాలతో ఒక ట్వీట్ చేయడం మినహా.. ప్రధాని నరేంద్రమోడీ ఈ విషయంలో ఇంకేమీ చొరవ చూపించకపోవడం కూడా చాలా అవమానకరం.
భారతీయ జనతా పార్టీ నాయకులు కపిల్ మిశ్రా గురించి విపక్షాలు అన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి. ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లనే దిల్లీ పరిస్థితి ఇక్కడదాకా వచ్చిందని అంటున్నారు. చివరికి భాజపా ఎంపీ గౌతంగంభీర్ కూడా కపిల్ మిశ్రాను తప్పుపట్టారు. అయినా సరే.. ఆయన మీద కనీస చర్య తీసుకోవడానికి కూడా భాజపా ఉపక్రమించకపోవడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా ఉంది.