విశాఖవాసులు మంచోళ్ళు. ఇది టీడీపీ వారు పెట్టిన ట్యాగ్. బాబుతో పాటు తమ్ముళ్ళు ఇచ్చిన అందమైన బిరుదు. అటువంటి విశాఖ వాసులు ఎపుడూ ఎవరినీ ఏమీ అనలేదు. తమకు తీరని అన్యాయం జరిగినా కిక్కురుమనని ఉత్త మంచివాళ్ళు.
అందుకే విశాఖకు రాజధాని ఎందుకు అని ఒకటికి వందసార్లు అని కూడా చంద్రబాబు విశాఖ టూర్ కి వస్తున్నారు. ఇక్కడి వారు ఏం చేయరని ఆయనకు బాగా తెలుసు, వీలైతే తన మీటింగుకుకి వచ్చి చెప్పేదంతా వింటారని ఆయన ఇంకా బాగా తెలుసు. ఎక్కడో చిత్తూరులో పుట్టిన చంద్రబాబుకే విశాఖ జనం ఉత్త అమాయకత్వం తెలిసాక ఇక్కడే పుట్టి పెరిగి రాజకీయం చేస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణకు తెలియకపోవడమేంటో.
విశాఖ, విజయనగరం జిల్లాల టూర్లకు వస్తున్న బాబుని ఈ ప్రాంతాల ప్రజలు ఎదిరించాలట. వీలైతే ఇక్కడికి రావద్దూ అంటూ గట్టిగా తరమాలట. మా ప్రాంతానికి ఏం చేశావని నిగ్గదీయాలట. అయిదేళ్ళ పాటు హామీలతో సినిమా చూపించి ఇపుడు తాపీగా వస్తావా అని కూడా అడగాలట. అంతేనా మేము ఏమీ అడగకుండానే జగన్ విశాఖను రాజధాని చేస్తూంటే ఎందుకు అడ్డుకుంటున్నావని ప్రశ్నించాలట. అమరావతి రాజధాని అంటున్న చంద్రబాబు గో బ్యాక్ అని కూడా అనాలట
విడ్డూరం కాకపోతే ఇవన్నీ ఉత్తరాంధ్రా వారు ఎలా చేయగలరని బొత్స వారు అనుకున్నారో కదా. వారే కనుక నిలదీసి అడిగితే అసలు అమరావతి రాజధాని పుట్టుక ఎక్కడిది, విశాఖలో తొలి మంత్రివర్గ సమావేశం పెట్టుకుని కూడా ఇక్కడ రాజధాని ప్రకటించని బాబుని ఆనాడే నిలదీసి కడిగేసి ఉండాలి.
సీఎం హోదాలో అయిదేళ్ళ పాటు వరసగా వైజాగ్ లో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు పెట్టుకుని రాజధానికి మాత్రం విశాఖ అసలు పనికిరాదన్నట్లుగా ఎకసెక్కం ఆడిన బాబుని నాడే నిగ్గదీసి ఉండాల్సింది. మరి అవేమీ చేయని ఈ ప్రాంత జనం ఇపుడు అర్జంటుగా బాబోరిని ఎదిరిస్తారని బొత్స వారికి ఎందుకొచ్చిందో అనుమానం.
విశాఖవాసులు ఏమీ చేయరని, ఏమీ చేయలేని వెర్రి జనమని బాబుకు, టీడీపీ తమ్ముళ్ళకు బాగా తెలుసు కాబట్టే ఆయన రెండు రోజుల టూర్ పెట్టుకుని మరీ విశాఖ వస్తున్నారు. ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ బాబు ముందు ఇలాంటి రాజకీయాలు చేస్తామంటే అసలు కుదరదు, ఆయన ముందు చేస్తామంటే తాతకు దగ్గులు నేర్పినట్లే మరి. విశాఖలో దర్జాగా బాబు టూర్ చేసి ఈ ప్రాంతం ప్రజలు రాజధాని అసలు కోరుకవడం లేదని బిగ్గరగా మీటింగులు పెట్టి మరీ చెబుతాడు.
అది కదా అసలు రాజకీయం. మరి బొత్స వారికి నిజంగా ఉత్తరాంధ్రా మీద ప్రేమ ఉంటే తన పార్టీ ద్వారా బాబుని నిగ్గదీస్తే బెటరేమో. ఆలా చేసినా తన మీద దాడి చేస్తున్నారని ట్విస్ట్ చేసి మరీ దాన్ని కూడా రాజకీయం చేయగల గండరగండడు బాబు. ఆయన మానాన ఆయన్ని టూర్ చేసుకోనిచ్చినా, అడ్డుకున్నా విశాఖ రాజధానిగా ఎవరూ కోరలేదని భారీ స్టేట్మెంట్ ఇచ్చిన తరువాత కానీ ఆయన తన పర్యటన ముగించడు కదా.