దేనికైనా వక్రభాష్యం చెప్పడంలో ఎల్లో మీడియా తర్వాతే ఎవరైనా. తమకు నచ్చిన పాలకులు చేస్తే మాత్రం…ఆహా, ఓహో అని కీర్తించడం, అదే పని నచ్చని వాళ్లు చేస్తే మాత్రం ఛీఛీ…థూథూ అని అభివర్ణిచండం ఎల్లో మీడియాకే సాధ్యం.
ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం శ్రీకారం చుట్టాడు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నం జిల్లాలోని కొందరు రైతులను కలిసి, ఆ తర్వాత విజయనగరం జిల్లాలో పర్యటించాల్సి ఉంది. చిత్తూరు జిల్లాలో ప్రజాచైతన్యయాత్ర టూర్‌ను ముగించుకుని ఆయన విశాఖ ఎయిర్‌ఫోర్ట్‌కు ఉదయం 11.20 గంటలకు చేరుకున్నాడు.
అయితే అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న చంద్రబాబును విమానాశ్రయం నుంచి మెయిన్‌రోడ్డు మీదకు రాకుండా వైసీపీ శ్రేణులతో పాటు ఉత్తరాంధ్ర జేఏసీ, ఇతర ప్రజా సంఘాల నేతలు అడ్డుకున్నారు. దాదాపు మూడు గంటలుగా ఆయన విమానాశ్రయం నుంచి కదల్లేని పరిస్థితి. ‘ముద్దు’
ఈ నేపథ్యంలో బాబు దత్త పుత్రిక ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో విశాఖలో బాబు అడ్డగింతపై ఆర్కే మార్క్ రాతలను రాసింది. ‘విశాఖలో వైసీపీ కార్యకర్తల గూండాగిరి’ శీర్షికతో చిన్న సైజ్ కథనాన్ని వండివార్చారు. ఆ కథనంలో వాడిన పదజాలాన్ని చూస్తే ఆంధ్రజ్యోతి అక్షరాలతో ‘వీరంగం’ చేసిందనిపిస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద ‘గూండాగిరి’ ప్రదర్శించారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును అడ్డుకునేందుకు అడుగడుగునా వైసీపీ శ్రేణులు యత్నించారు. అలాగే టీడీపీ శ్రేణులపై ‘వీరంగం’ చేశారు.
ఇదే అమరావతిలో టీడీపీ శ్రేణులు చేస్తే ‘రాజధాని రైతుల గాంధీగిరి’ అనే హెడ్డింగ్లతో ‘కమ్మ’ని వార్తలు రాస్తారు. రాజధాని రైతులు ఇటీవల బాపట్ల దళిత ఎంపీ నందిగం సురేష్‌పై దాడి చేస్తే…‘మహిళా జేఏసీ నేతలపై దాష్టీకం’ శీర్షిక, వైసీపీ ఎంపీ అనుచరుల దౌర్జన్యం; మహిళలను దుర్భాషలాడిన నందిగం సురేష్ అని ఉప శీర్షికలు పెట్టి అక్షరాలతో పైశాచిక ఆనందం పొందారు. అమరావతిలో ఏం చేసినా ‘రైట్’, అదే ఉత్తరాంధ్రలో, రాయలసీమలో కడుపు మండి ప్రజలు తిరుగుబాటు చేస్తే మాత్రం ‘రాంగ్’…ఇదీ ఎల్లో మీడియా పాలసీ.