ముఖ్యమంత్రిగా పధ్నాలుగేళ్ళు పనిచేసిన అనుభవం చంద్రబాబులో ఏ కోశానా కన్పించదు. రాజకీయాలన్నాక నిరసనలు తప్పవు. ఆ విషయం చంద్రబాబుకీ తెలుసు. గతంలో చంద్రబాబు హయాంలో బీజేపీ నేతలపై దాడులు జరిగాయి.. అది టీడీపీ – బీజేపీ మధ్య తెగతెంపులు జరిగాక. దాన్ని ‘నిరసన’ అనుకోవాలట. కానీ, చంద్రబాబుకి వ్యతిరేకంగా విశాఖలో వైసీపీ శ్రేణులు నిరసన తెలిపితే, అది రౌడీయిజం అట.!
పైగా, చంద్రబాబు ‘నా మీద కోడిగుడ్లు విసిరారు.. టమోటాలతో కొట్టేందుకు యత్నించారు.. వాటర్ బాటిళ్ళతో దాడి చేయబోయారు.. రాళ్ళు కూడా విసిరారు..’ అంటూ అంటూ ఆరోపిస్తుండడం గమనార్హం. బాధ్యతగల ప్రతిపక్ష నేత చేయాల్సిన వ్యాఖ్యలేనా ఇవి.? నిజానికి, చంద్రబాబుని అడ్డుకోవాలన్న వైసీపీ ఆలోచన ఓ చారిత్రక తప్పిదం.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, ఇక్కడ టీడీపీ తక్కువేం తిన్లేదు. టీడీపీ నేతలు, ఆందోళనకారుల్ని రెచ్చగొట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు.
టీడీపీ మహిళా నేత అనిత అయితే, ముఖ్యమంత్రిని దుర్భాషలాడేశారు. పెద్ద సంఖ్యలో గుమికూడిన ఆందోళనకారుల్ని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులన్నారు. ‘చేతకానోళ్ళు.. చేవలేనోళ్ళు..’ అంటూ చెలరేగిపోయారామె. ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో కొద్ది సంఖ్యలో మాత్రమే టీడీపీ నేతలున్నారు. వైసీపీ శ్రేణులు మాత్రం భారీగా మోహరించాయక్కడ. ఇదంతా పోలీసుల కుట్రేనన్నది టీడీపీ ఆరోపణ.
‘పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తల్లా మారిపోయారు..’ అంటూ పోలీసుల మీద టీడీపీ నేతలు ఆరోపణలు చేశారుగానీ, ఆ పోలీసులే లేకపోయి వుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకెంతటి తీవ్రమైన పరిస్థితుల్ని ఎదుర్కొనేవారో. వైసీపీ కార్యకర్తల్ని అదుపు చేయడానికి పోలీసులు చాలా తీవ్రంగానే ప్రయత్నించాల్సి వచ్చింది. ఓ దశలో టీడీపీ అధినేతపైకి టమోటాలు, కోడి గుడ్లు విసిరేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులు.. ఆ తర్వాత కేవలం ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేయడానికే పరిమితమవడం గమనార్హం.
ఏదిఏమైనా, విశాఖలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారతాయని తెలిసీ.. చంద్రబాబు అత్యుత్సాహం ప్రదర్శించడం ఆక్షేపణీయమే. ప్రభుత్వం తరఫున కూడా భద్రతా వైఫల్యాలు సుస్పష్టం. వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం సంగతి సరే సరి. కారణాలేవైతేనేం.. ప్రశాంత నగరం విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.