విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ట్విటర్ వేదికగా మద్దతు ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవిపై ప్రధానంగా ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు కారణమైన బీజేపీతో మిత్రపక్షమైన జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయంగా నష్టపోకుండా చిరంజీవి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా చిరంజీవి ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టే తేల్చి చెప్పారు. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా కదలి రావాలని ఆయన పిలుపునివ్వడం ద్వారా… ఉక్కు పోరులో చిరంజీవి ప్రత్యక్షంగా పాల్గొంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీతో మిత్రపక్షంగా ఉంటున్న పవన్‌కల్యాణ్‌కు రాజకీయంగా డ్యామేజీ కాకుండా చిరు రంగంలోకి దిగారనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఉక్కు ఉద్యమంలో చిరంజీవి ప్రవేశిస్తే …తమ రాజకీయ ప్రయోజనాలు పూర్తిగా నెరవేరవనే ఆందోళన, ఆగ్రహం వెరసి చిరుపై అనుమానాని దారి తీస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జగన్ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ కారణంగా చేపట్టిన మూడు రాజధానుల ప్రకటనకు గతంలో చిరంజీవి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో చిరంజీవిని ఒక వర్గం మీడియా, ప్రధాన ప్రతిపక్షం టార్గెట్ చేసింది. రాజధాని ఉద్యమానికి మద్దతు ఇవ్వని చిరంజీవి, నేడు ఉక్కు పోరాటానికి సపోర్ట్‌గా ఇచ్చిన ట్వీట్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కుట్ర వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి ప్రకటనను ఒకసారి గమనిద్దాం.
‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా తన చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతబట్టి గోడల మీద విశాఖ ఉక్కు సాధిస్తామనే నినాదాన్ని రాశాం. హర్తాళ్లు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశాం. దాదాపు 35 మంది పౌరులతో పాటు, 9 ఏళ్ల బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన ఆనాటి మహోద్యమ త్యాగాల ఫలితంగా సాకారమైన విశాఖ ఉక్కు కర్మాగరం ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు అందరం సంబరాలు చేసుకున్నాం. ఆంధ్రుల హక్కుగా, ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా భావించి సంతోషించాం.
విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇన్నేళ్లయినా క్యాప్టివ్‌మైన్స్ కేటాయించకపోవడం, అలాగే నష్టాలొస్తున్నాయనే సాకుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం సమంజసం కాదు. లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన విశాఖ ఉక్కును ప్రయివేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలి. విశాఖ ఉక్కును రక్షించుకోవడమే ఇప్పుడు ప్రధాన కర్తవ్యం. ఇది ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన, న్యాయ సమ్మతమైన హక్కు. ఆ హక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకుందాం’ అని ఆయన పిలుపునిచ్చారు.
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకమైన కొత్తలో , ఆయన చిరంజీవిని కలిసి మద్దతు కోరారు. చిరంజీవిని కలవడం ద్వారా కాపులంరినీ ఐక్యం చేయాలనే హిడన్ ఎజెండాతో సోము అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరిగింది. ఏపీ బీజేపీ- జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిరు మరోసారి రాజకీయంగా యాక్టీవ్ కానున్నారనే ప్రచారం కూడా జరిగింది.
ఇటీవల జనసేన కీలకనేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ చిరు మద్దతు తమకు ఉంటుందని ప్రకటించారు. అవసరమైన సమయంలో ఆయన జనసేనకు అండగా నిలుస్తారని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సోము వీర్రాజు కూడా తమ కూటమికి చిరంజీవి మద్దతు ఇస్తారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై ఆంధ్రప్రదేశ్ సమాజం భగ్గుమంటోంది.
దీంతో బీజేపీతో పాటు దాని మిత్రపక్షమైన జనసేన ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఏం చేయాలో ఆ రెండు పార్టీలకు తోచడం లేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేష పాపులారిటీ ఉన్న చిరంజీవి విశాఖ ఉక్కు పోరాటానికి సంకల్పించడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉక్కు ఉద్యమానికి చిరు మద్దతు ప్రకటించడం వెనుక తమ్ముడు పవన్‌కల్యాణ్, ఏపీ బీజేపీ నేతల వ్యూహం ఉందని అన్ని రాజకీయ పక్షాలు అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నట్టు సమాచారం.
చిరు ప్రత్యక్ష పోరుతో తమ్ముడికి రానున్న రోజుల్లో రాజకీయంగా లాభం చేకూర్చ వచ్చనే ఎత్తుగడ ఉందంటున్నారు. ఎందుకంటే బీజేపీతో పొత్తు కారణంగా పవన్‌కల్యాణ్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. తమ్ముడి ఇబ్బందిని గమనించిన అన్న చిరంజీవి … తెలివిగా ఉక్కు ప్రయివేటీకరణపై వ్యతిరేకతను వ్యక్తం చేయడంతో పాటు రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా పోరాడి హక్కును సాధించుకుందామని పిలువునివ్వడం గమనార్హం.
అందుకే చిరు స్పందనపై ప్రధానంగా ప్రతిపక్షాల్లో రకరకాల అనుమానాలు నెలకున్నాయి. అలాగని ఆయన స్వచ్ఛంగా ఇచ్చిన మద్దతును కాదనలేని పరిస్థితి. విశాఖ ఉక్కుకు నేడు చిరు మద్దతు ప్రకటించడంతో పాటు నేరుగా ఆందోళనకు దిగితే …రానున్న రోజుల్లో జనసేన -బీజేపీ కూటమి తరపున ప్రచారం చేస్తే రాజకీయంగా లాభం జరుగుతుందని భావిస్తున్నారు. రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారి సొంతం.