ఓ మంచి నటుడు, మరో నటుడ్ని మనసారా మెచ్చుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. అలాంటి అరుదైన సన్నివేశమే ఒకటి చోటు చేసుకుంది. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రావు రమేశ్, శర్వానంద్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. శ్రీకారం సినిమాలో వీళ్లిద్దరూ తండ్రికొడుకులుగా నటించారు. ఓ సన్నివేశంలో శర్వా నటన తనను ఆశ్చర్యానికి గురిచేసిందంటున్నాడు రావు రమేష్.
“మనం తండ్రికొడుకులుగా నటించాం. నేను ఆశ్చర్యపోయిన అయిన విషయం ఏంటంటే మీరు కొంచెం కూడా యాక్టింగ్ లో ఎక్స్ ట్రా చేయలేదు. నేను మిమ్మల్ని పొగడ్డం కోసం ఇది చెప్పడం లేదు. ఎక్కువ డ్రామా చేయమంటే మీరు చేయరు. డబ్బింగ్ లో చూసినప్పుడు మీరు చేసింది ఎంత ఇంపాక్ట్ చూపించిందో నాకు అర్థమైంది.”
ఇలా శర్వానంద్ యాక్టింగ్ ను మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు రావురమేష్. శ్రీకారం సినిమాలో కేశవులు అనే రైతు పాత్ర పోషించాడు రావు రమేష్. నిజజీవితంలో కూడా తను రైతు పాత్ర పోషించానని, కానీ అట్టర్ ఫెయిల్ అయ్యానని తన స్వీయానుభవాన్ని చెప్పుకొచ్చారు.
“మద్రాసులో ఉన్నప్పుడు 1995లో వ్యవసాయంలో కొన్ని విన్యాసాలు చేశాను. అప్పుడే పుట్టగొడుగుల వ్యాపారం ఊపందుకుంటున్న టైమ్ లో నేను కూడా ట్రై చేశాను. న్యూస్ పేపర్లలో భారీ లాభాలు అని చదివి నేను దిగాను. అప్పట్లో పనిపాట లేదు, ఏదో చేయాలని ఉండేది. మొత్తానికి పుట్టగొడుగులు వేసేశాను. అది పండించడం మామూలు విషయం కాదు. దాని కంటే ఇంకేదైనా చేయొచ్చు అనిపించింది. ఫైనల్ గా చూస్తే ఒక్క రూపాయి కూడా సంపాదించలేకపోయాను.”
ఇలా తన ఫెయిల్యూర్ అగ్రికల్చర్ స్టోరీని బయటపెట్టారు రావురమేష్. దాదాపు దశాబ్దం తర్వాత శర్వా-రావురమేష్ కలిసి శ్రీకారం సినిమా చేశారు. ప్రచారాన్ని పెద్దగా ఇష్టపడని రావురమేష్, తొలిసారి గ్రేట్ ఆంధ్ర కోసం శ్రీకారం ప్రమోషన్ లో భాగంగా శర్వానంద్ ను ఇంటర్వ్యూ చేయడం విశేషం.