కోమ‌లి పోరాటానికి త‌లొగ్గిన శేఖ‌ర్ క‌మ్ముల

గాయ‌ని కోమ‌లి పోరాటానికి  శేఖ‌ర్ క‌మ్ముల ఎట్ట‌కేల‌కు త‌లొగ్గాల్సి వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో త‌న‌పై విప‌రీతంగా జ‌రుగుతున్న ట్రోలింగ్ జ‌రుగుతోంద‌ని ఆయ‌న గ్ర‌హించాడు. ‘లవ్‌ స్టోరీ’ చిత్రంలోని ‘సారంగ దరియా..’ పాట విష‌య‌మై నెల‌కున్న…

గాయ‌ని కోమ‌లి పోరాటానికి  శేఖ‌ర్ క‌మ్ముల ఎట్ట‌కేల‌కు త‌లొగ్గాల్సి వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో త‌న‌పై విప‌రీతంగా జ‌రుగుతున్న ట్రోలింగ్ జ‌రుగుతోంద‌ని ఆయ‌న గ్ర‌హించాడు. ‘లవ్‌ స్టోరీ’ చిత్రంలోని ‘సారంగ దరియా..’ పాట విష‌య‌మై నెల‌కున్న వివాదానికి ముగింపు ప‌లికేందుకు శేఖ‌ర్ క‌మ్ముల చొర‌వ చూపాడు. ఈ పాట‌ను త‌న అవ్వ ద‌గ్గ‌ర  సేక‌రించాన‌ని, త‌న‌తో కాకుండా మంగ్లీతో పాడించి త‌న‌కు అన్యాయం చేశారంటూ గాయ‌ని కోమ‌లి గ‌త కొన్ని రోజులుగా వివిధ మీడియా వేదిక‌లుగా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

కోమ‌లికి పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఈ నేప‌థ్యంలో ‘లవ్‌ స్టోరీ’ చిత్ర ద‌ర్శ‌కుడు శేఖర్ క‌మ్ముల ఎట్ట‌కేల‌కు దిగిరాక త‌ప్ప‌లేదు. ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాడు. ఆ పాట క్రెడిత్ అంతా కోమ‌లికే ద‌క్కుతుంద‌ని పేర్కొన్నాడు. అంతేకాదు, తాము ఇస్తామ‌న్న డ‌బ్బులు ఇవ్వ‌డంతో పాటు పాట పాడాల‌నే కోమ‌లి కోరిక తీరుస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించాడు. ఆ ప్ర‌క‌ట‌న‌లోని పూర్తి సారాంశం ఏంటంటే…

‘చాలా ఏళ్ల కిందట ‘రేలా రే రేలా’ ప్రోగ్రాంలో  శిరీష అనే అమ్మాయి పాడిన ‘సారంగ దరియా’ పాట నా మనసులో తిరుగుతూనే  ఉంది. ‘లవ్‌ స్టోరీ’కి తగ్గట్టు ‘సారంగ దరియా’ పాట రాయాలని సుద్దాల అశోక్‌ తేజగారిని కలిశా. ఆయన ఆ పాట పల్లవి తీసుకుని, ప్రత్యేకంగా చరణాలు రాశారు. ఆ పాటని శిరీషతో పాడిద్దామనుకున్నాం. అయితే పాటను తొలుత వెలుగులోకి తీసుకొచ్చిన కోమలితో పాడిద్దామని సుద్దాల గారు అన్నారు. వరంగల్‌ నుంచి ఆమెని రమ్మని కోరాం.. జలుబు, దగ్గు ఉండటం వల్ల రాలేను అన్నారు.

అప్పటికే చెన్నై నుంచి సంగీత దర్శకుడు రికార్డింగ్‌ కోసం వచ్చి ఉండటంతో మంగ్లీతో పాడించాం. ఆ పాట క్రెడిట్‌తో పాటు డబ్బులు ఇస్తామని కోమలికి చెబితే సరేనన్నారు. పాట రిలీజ్‌ తర్వాత టీవీల్లో వచ్చిన కోమలి చర్చలు నేను చూడలేదు. ఈ పాట క్రెడిట్‌ తప్పకుండా ఆమెకి ఇవ్వడంతో పాటు మేము ఇస్తామన్న డబ్బులూ ఇస్తాం. ఆడియో వేడుకలో తనతో పాట పాడిస్తా’ అని శేఖర్‌ కమ్ముల వివ‌రించాడు.

ఇదిలా ఉండ‌గా ‘సారంగ దరియా..’ ఎంత పాపుల‌ర్ అయ్యిందో, కోమ‌లి మీడియా ముందుకొచ్చిన క‌న్నీళ్లు పెట్టుకోవ‌డంతో చిత్ర ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌తో పాటు ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత‌, గాయ‌కుడు సుద్దాల అంత‌గా అన్‌పాపుల‌ర్ అయ్యారంటే అతిశ‌యోక్తి కాదు. శేఖర్ క‌మ్ముల సానుకూల‌ ప్ర‌క‌ట‌పై కోమ‌లి ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి!

మద్రాసులో పుట్టగొడుగులు పండించి మొత్తం నష్టపోయా.. 

ప్రభాస్ కు పెద్ద ఫ్యాన్