బిగ్‌బాస్ ఫేమ్ దేత్తడి హారికకు కోపం వచ్చింది. తెలంగాణ టూరిజం బ్రాండ్ అండాసిడర్ పదవికి గుడ్‌బై చెప్పింది. టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా హారికను ఎంపిక చేసిన తర్వాత ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్ అయ్యారు. అసలు తనకు లేదా ముఖ్యమంత్రి కార్యాలయానికి గానీ తెలియకుండా హారిక నియామకం జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హారిక ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్సీ ఎన్నికల బిజీలో ఉన్నానని, ఆ హడావుడి ముగిసిన తర్వాత దేత్తడి హారిక నియామకం ఇష్యూపై దృష్టి పెడతానని ఆయన ప్రకటించారు.
ఈ నేపథ్యంలో తన నియామకం వివాదాస్పదం కావడంపై హారిక నొచ్చుకున్నారని తెలిసింది. దీంతో ఈ సమస్యకు ఫుల్స్టాప్ పెట్టేందుకు ఆమె నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి హారిక హూందాతనాన్ని చాటుకుంది. సరిగ్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నియమతులైన హారిక …మూడో రోజే బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి వైదొలగడం గమనార్హం.
ఈ సందర్భంగా హారిక తాను తప్పుకున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో ఆమె ఏమన్నారో తెలుసుకుందాం.
‘అందరికీ నమస్తే. ఒక చిన్న క్విక్ అప్డేట్.. మహిళా దినోత్సవం రోజు నన్ను టీఎస్‌టీడీసీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం దగ్గర నుంచీ ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. కొన్ని కారణాలతో ఆ పదవి నుంచి తప్పుకుంటున్నా. నాకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. లవ్యూ ఆల్’’ అంటూ హారిక చెప్పారు.
రాజకీయ కారణాలతో తనను తప్పించే పరిస్థితి తెచ్చుకోకుండా ముందే సరైన నిర్ణయాన్ని తీసుకున్న హారికను పలువురు ప్రశంసిస్తున్నారు. హారిక నియామకంతో టూరిజంశాఖలో నెలకున్న విభేదాలను బయటపెట్టాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.