రోబో-2 సినిమా విడుదల దగ్గరకు వస్తుంటే, బిజినెస్ వ్యవహారాల్లో తలకాయనొప్పులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ముందుగా తెలుగు వెర్షన్ ను ఏషియన్ సునీల్ కు ఇచ్చారు. ఆయనతో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రిలయన్స్ సంస్థలు పార్టనర్లు. ఆ మేరకు అగ్రిమెంట్లు కూడా అయిపోయాయి.
అడ్వాన్స్ లు ఇచ్చారు. తీరా సినిమా లేట్ అవుతుంటే, అడ్వాన్స్ వెనక్కు కొంత ఇవ్వండి, మళ్లీ విడుదల టైమ్ లో ఇస్తామని బయ్యర్లు అడిగినట్లు బోగట్టా. దానికి లైకా ప్రొడక్షన్స్ కొంత వెనక్కు ఇచ్చింది కానీ ఇంకా 13 కోట్లు ఇవ్వాలి.
అదీకాక, ఏషియన్ సునీల్ అండ్ కోకి చేసిన అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేయలేదు. ప్రస్తుతానికి రోబో 2 తెలుగు హక్కుల అగ్రిమెంట్ వాళ్ల పేరట వుంది. లైకాతో వచ్చిన సమస్యను పరిష్కారం కోసం ఏషియన్ సునీల్ సమస్య పరిష్కరించమని, లైకాతో సంబంధాలున్న ఎన్వీ ప్రసాద్ ను కోరినట్లు తెలుస్తోంది.
కానీ మరి ఏమయిందో, రోబో 2 ఎన్వీప్రసాద్ చేతిలోకి వచ్చినట్లు వార్తలు బయటకు వచ్చాయి. దీంతో ఎన్వీ ప్రసాద్ ను తాము మధ్యవర్తిగా వుంచాలనుకుంటే, మొదటికే మోసం వచ్చిందని ఏషియన్ సునీల్ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈసంగతి అలా వుంచితే ఏషియన్ సునీల్ కు ఇవ్వాల్సిన 13 కోట్లు, ప్లస్ వడ్డీ ఇవ్వాల్సి వుంది. కేవలం 13 ఇచ్చి చేతులు దులుపుకునే వుద్దేశంలో లైకా వున్నట్లు వినిపిస్తోంది. దీంతో అసలు 13 కోట్లు, వడ్డీ అన్నీ అణాపైసలతో సహా ఇస్తేనే, విడుదలకు సహరిస్తామని, లేదంటే, సినిమా ఎలా విడుదలవుతుందో చూస్తామని ఏషియన్ సునీల్, దగ్గుబాటి సురేష్ బాబు పట్టుదలగా వున్నట్లు తెలుస్తోంది.
ఈ రోజుకు అగ్రిమెంట్ వారిపేరునే వుండడం అన్నది వారికి బలమైన పాయింట్ గా మారింది. ఎన్వీ ప్రసాద్ ఈ పంచాయతీని ఎలా తెగ్గొడతారో చూడాలి.