రోబో 2 విడుదల దగ్గరకు వస్తోంది. మరి ఈ సినిమాను తెలుగులో ఎవరు విడుదల చేస్తారు? తెలుగు హక్కులు ఎవరికి ఇచ్చారు? ఎంతకు ఇచ్చారు? వాస్తవానికి రోబో 2 హక్కులు 81 కోట్లకు ఏషియన్ సునీల్ తీసుకున్నారు. ఇది చాలాకాలం ముందటి ముచ్చట. అయితే రోబో 2 ప్రాజెక్టు ఆలస్యం అవుతుంటే, ఏషియన్ సునీల్ కొంత అడ్వాన్స్ వెనక్కు తెచ్చుకున్నారు. ఆ తరువాత మిగిలిన అడ్వాన్స్ అలాగే వుంది.
అయితే ఇప్పుడు ఫైనల్ గా లైకా ప్రొడక్షన్స్ తమకు సన్నిహిత సంబంధాలున్న ఎన్వీప్రసాద్ కే రోబో 2 విడుదల బాధ్యతలు అప్పగించింది. కాలా సినిమాకు సంబంధించి ఎన్వీ ప్రసాద్ కు 17కోట్ల వరకు వెనక్కు ఇవ్వాల్సి వుంది.
అందులో కొంత నిర్మాతగా ధనుష్ భరిస్తానన్నాడు. అలాగే ఏషియన్ సునీల్ కు ఇవ్వాల్సిన 13కోట్ల వ్యవహారం వుంది. ఈ రెండు కలిపి 30 కోట్లు. అంటే సునీల్ కు ఎన్వీ ప్రసాద్ క్లియర్ చేస్తారన్నమాట. ఈ ముఫైకోట్లు పోగా, యాభై కోట్లు రికవరబుల్ అడ్వాన్స్ గా పంపించమని లైకా ప్రొడక్షన్స్ అడుగుతోంది.
రికవరబుల్ అడ్వాన్స్ కాబట్టి, పెద్దగా సమస్య లేదు. అయితే ఎన్వీ ప్రసాద్ యాభై పంపిస్తారా? లేదా నలభై పంపిస్తారా? అన్నదాన్ని బట్టి, రోబో 2 ఏ మొత్తానికి ఆంధ్రలో రికవరబుల్ అడ్వాన్స్ మీద పంపిణీకి ఇచ్చారన్నది క్లారిటీ వస్తుంది.
అవుట్ రేట్ కు 81 కోట్లకు అమ్మాల్సిన రోబో 2 కేవలం నిర్మాణంలో ఆలస్యం కారణంగా రికవరబుల్ అడ్వాన్స్ మీద పంపిణీ చేయించుకోవాల్సి వచ్చినట్లు అయింది.
ఇదిలా వుంటే దిల్ రాజు, యువి వంశీ కూడా ఎన్వీప్రసాద్ తో ఈ వెంచర్లో పాలు పంచుకుంటున్నట్లు తెలుస్తోంది.ముగ్గురు కలిపి అడ్వాన్స్ పూల్ చేసి, కమిషన్ ను పంచుకుంటారన్నమాట.