చేతులు కాలాక‌…

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతికి ప్ర‌ధానంగా కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు కేంద్ర ఎన్నిక‌ల సంఘమే కార‌ణామ‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప‌లు రాష్ట్రాల హైకోర్టులు కూడా ఈసీ వైఖ‌రిపై ఘాటు వ్యాఖ్య‌లు…

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతికి ప్ర‌ధానంగా కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు కేంద్ర ఎన్నిక‌ల సంఘమే కార‌ణామ‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప‌లు రాష్ట్రాల హైకోర్టులు కూడా ఈసీ వైఖ‌రిపై ఘాటు వ్యాఖ్య‌లు చేశాయి. ఇక భార‌త్‌లో క‌రోనా విజృంభ‌ణ‌కు మోడీ స‌ర్కార్ అవ‌లంబించిన విధానాల‌పై అంత‌ర్జాతీయ మీడియా ఏకి పారేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఈసీ తాజాగా ఓ ఆదేశం ఇవ్వ‌డం, దానిపై బీజేపీ హ‌ర్షం వ్య‌క్తం చేయ‌డంపై సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. మే 2న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డైన త‌ర్వాత విజ‌యోత్స‌వ ర్యాలీలు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని ఈసీ నిషేధం విధిస్తూ కాసేప‌టి క్రితం ఆదేశాలిచ్చింది. ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నట్టు ఆ వెంట‌నే బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

అసోం, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్‌, కేర‌ళ‌, పుదుచ్చేరి స‌హా తెలంగాణ‌లో నాగార్జున‌సాగ‌ర్ అసెంబ్లీ, ఆంధ్రాలో తిరుప‌తి లోక్‌స‌భ స్థానానికి వివిధ ద‌శ‌ల్లో ఉప ఎన్నిక‌లు చేప‌ట్టారు. ప‌శ్చిమ‌బెంగాల్‌లో 8 విడ‌త‌ల్లో చేప‌ట్టారు. చివ‌రి విడ‌త ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. వీటి ఫ‌లితాలు మే 2న వెలువ‌డ‌నున్నాయి. అయితే విజ‌యోత్స‌వ ర్యాలీల‌తో క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం గుర్తించి, నిషేధించిన‌ట్టు సంబంధిత అధికారులు చెప్ప‌డంపై వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది.

ఇప్ప‌టికే ఈసీ చ‌ర్య‌ల వ‌ల్ల పూడ్చ‌లేని న‌ష్టం జ‌రిగిపోయింద‌ని, కొత్త‌గా విజ‌యోత్స‌వ ర్యాలీల‌ను అడ్డుకోవ‌డం వ‌ల్ల ఒరిగేదేముంద‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. అస‌లు ఎన్నిక‌ల‌నే వాయిదా వేసి ఉంటే ….క‌రోనా సెకండ్ వేవ్‌తో ల‌క్ష‌లాది మంది ఆ మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌క‌పోవ‌డంతో పాటు వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకునే వాళ్లు కాదు క‌దా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.  

ఇప్పుడు చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా ఈసీ వైఖ‌రి ఉంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈసీ నిర్ణ‌యంపై బీజేపీ హ‌ర్షం వ్య‌క్తం చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. 

ఈసీ నిర్ణ‌యంపై బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా ట్వీట్ ఒక‌సారి చూద్దాం. ‘ఎన్నికల విజయోత్సవాలను నిషేధిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయాలని నేను ఇప్పటికే అన్ని రాష్ట్రాల బీజేపీ విభాగాలను ఆదేశించాను. ఈ విపత్కర సమయంలో పార్టీ కార్యకర్తలంతా తమ శక్తి, సామర్థ్యాలను అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం కోసం ఉపయోగించాలని కోరుతున్నాను’ అని  నడ్డా పేర్కొన్నారు.

చెప్పేదొక‌టి, చేసేదొక‌టి అనే చందంగా బీజేపీ, ఈసీ చ‌ర్య‌లున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో …ఈసీ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించ‌డం విడ్డూరంగా ఉంద‌ని బీజేపీ చీఫ్ న‌డ్డాపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన డ్యామేజీకి కార‌కులెవ‌రు?  వారికి ఏ శిక్ష విధించాల‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.