ఏదైనా ఒక ఘటన జీవితాంతం నీడలా వెంటాడుతోందంటే…అది వాళ్ల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నట్టే. అది మంచైనా, చెడైనా…ఏదైనా కావచ్చు. ప్రముఖ తమిళ నటి రేఖను కూడా ఓ ముద్దు పీడకలలా వెంటాడుతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రముఖ హీరో కమల్‌హాసన్ ఓ సినిమా షూటింగ్లో తనకు పెట్టిన ముద్దుపై రేఖ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలచందర్ దర్శకత్వంలో `పున్నగాయ్ మన్నన్` సినిమా తెరకెక్కింంది. ఈ చిత్రంలో రేఖ, కమల్ హాసన్ జంటగా నటించారు. ఆ సినిమాలో వీరిద్దరి మధ్య ఓ ముద్దు సన్నివేశం ఉంది. కమల్ ముద్దు పెట్టే వరకు …ఆ సన్నివేశం గురించి తనకు ముందుగా చెప్పలేదని రేఖ వాదన. ప్చ్… తన అనుమతి లేకుండానే కమల్ ముద్దు పెట్టారని రేఖ ఆ ఇంటర్వ్యూలో వాపోయారు.
`పున్నగాయ్ మన్నన్` సినిమాకు సంబంధించి సూసైడ్ సీన్ షూటింగ్ చేస్తున్నాం. ఒక్కసారిగా కమల్ నాకు ముద్దు పెట్టేశారు. నాకేం అర్థం కాలేదు. ముద్దు సీన్ ఉందని నాకు బాలచందర్ కానీ, కమల్ కానీ చెప్పలేదు. నా అనుమతి లేకుండా కమల్ ముద్దు పెట్టేయడంతో కోపం వచ్చింది. షూటింగ్ అయిపోయాక నేను బాలచందర్ గారి దగ్గరకు వెళ్లి అడిగాను. అందుకు ఆయన.. `ఈ ముద్దు సీన్లో తప్పేముంది? అందులో ఎలాంటి అసభ్యతా లేదు. ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ ఉందని చూపించడానికే ఆ సీన్ పెట్టాం` అని కూల్‌గా చెప్పారు.
'ఎందుకోగానీ, ఆ సీన్ నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటోంది. నాకు కొన్ని రోజుల పాటు నిద్ర కూడా పట్టలేదంటే నమ్మండి. మనసుకు నచ్చని పనులు బహుశా అలా చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయేమో. ఆ ముద్దు నా మనసును గాయపరిచింది. అదో పీడకలలా నన్ను వెంటాడింది` అని రేఖ తన ఆవేదనను ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.