అవిగో ఎన్నికలు.. ఇదుగో చిరంజీవి

రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సందర్భంలో మరోసారి ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి,  ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వైసీపీ తరపున ఏపీ కోటాలో చిరంజీవి రాజ్యసభకు ఎన్నిక అవుతారని,…

రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సందర్భంలో మరోసారి ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి,  ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వైసీపీ తరపున ఏపీ కోటాలో చిరంజీవి రాజ్యసభకు ఎన్నిక అవుతారని, అన్నీ కలిసొస్తే మంత్రి పదవి కూడా వరిస్తుందని ఊదరగొడుతున్నారు. నిప్పు లేకుండానే పొగ రాజేస్తున్నారు.

అయితే అటు చిరంజీవి కానీ, ఇటు వైసీపీ వర్గాలు కానీ ఎవరూ అధికారికంగా దీన్ని ఖండించకపోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్టయింది. ఎవరికి నచ్చినట్టు వారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు సొంత సమీకరణాలు రాసుకుంటూ రచ్చ చేస్తున్నారు. అయితే అకారణంగా చిరంజీవి పేరుని తెరపైకి తెచ్చారనేది మాత్రం వాస్తవం.

జగన్ ఇమేజ్ ని డ్యామేజీ చేయడానికే టీడీపీ ఈ ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతున్నా.. మీడియా కూడా ఈ ఉచ్చులో పడిపోయి రేటింగ్ ల కోసం చిరంజీవి బొమ్మని చూపించుకుంటూ రోజులు గడిపేస్తోంది. చిరంజీవి, జగన్ భేటీ అయిన సందర్భం ఒక్కదాన్ని పట్టుకుని దాని చుట్టూ కథలు అల్లేస్తోంది.

వైసీపీ తరపున చిరంజీవి రాజ్యసభకు వెళ్తే.. ఇరువర్గాలకు లాభం కంటే ఎక్కువగా నష్టమే జరుగుతుంది. రాజకీయాల్లో చిరంజీవిని ఎవరూ నమ్మరు, అటు వైసీపీ కూడా రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చినట్టేనని అర్థం చేసుకోవాలి. ఇలాంటి తప్పు జగన్ ఎప్పటికీ చేయరు. అందుకే చిరు రాజ్యసభ ప్రయాణం ఒక ప్రచారమే కానీ, యదార్థం ఎంతమాత్రం కాదు.

ఇప్పుడే కాదు, ఏపీలో కీలక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చిరంజీవి ప్రస్తావన ఉంటూనే ఉంది. కేవలం సొంత లాభం కోసమే మీడియా ఈ అంశాన్ని భుజానికెత్తుకుంటోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా చిరంజీవి పేరు ప్రముఖంగా వినిపించింది. ఈసారి కూడా అదే జరుగుతోంది. వైసీపీ తమ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించే వరకు ఈ ప్రచారానికి అడ్డుకట్ట పడేలా లేదు. లేదా చిరంజీవి తరపున ఎవరైనా స్టేట్ మెంట్ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

బాధపడుతున్న వంశీ పైడిపల్లి