ఏ హీరోనూ వెంటాడని విచిత్రమైన కేసులో ధనుష్ చిక్కుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ధనుష్ తమ కొడుకంటూ మధురైకి చెందిన దంపతులు కేసు వేసి, అప్పట్లో నానా యాగీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు హైకోర్టు వరకు వెళ్లింది. చివరికి ధనుష్ తన బర్త్ సర్టిఫికేట్, విద్యార్హతల పత్రాలు చూపించడంతో కేసు అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడీ కేసు మరో మలుపు తిరిగింది.
ధనుష్ ను తమ బిడ్డగా చెబుతున్న కదిరేశన్ దంపతులు ఇప్పుడు కొత్త కేసుకు రెడీ అవుతున్నారు. ఈసారి వీళ్లు వాదిస్తున్నదేంటంటే.. గతంలో ధనుష్ కోర్టుకు సమర్పించిన విద్యార్హత, బర్త్ సర్టిఫికేట్లు అసలైనవి కాదట. నకిలీ పత్రాలు చూపించాడట. కాబట్టి ఇప్పుడు ధనుష్ పై ఏకంగా క్రిమినల్ కేసు వేయాలని కోరుతున్నారు వీళ్లు.
ఈ మేరకు మధురై పోలీస్ కమిషనర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా కోరారు. అయితే కదిరేశన్ విజ్ఞప్తిని పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఇతడు మధురై కోర్టును ఆశ్రయించాడు. ధనుష్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని పిటిషన్ లో కోరాడు.
ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణకు వచ్చేనెల 9కి వాయిదా వేసింది. ధనుష్ సమర్పించిన సర్టిఫికేట్లు నకిలీవా లేక అసలైనవా తేల్చాల్సిందిగా పోలీసుల్ని కోర్టు ఆదేశించే అవకాశం ఉంది. అవి నకిలీ సర్టిఫికేట్స్ అయితే మాత్రం ధనుష్ పై క్రిమినల్ కేసు తప్పదు.