అవును.. వైఎస్ఆర్ కంటె జగన్ శక్తిమంతుడే!

కొన్ని లక్షల మంది పేదల ఇళ్లలో దేవుడి పటాల మధ్య తన ఫోటోకు స్థానం సంపాదించుకున్న జననేతగా వైఎస్ రాజశేఖర రెడ్డికి గుర్తింపు ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో.. పేదలకోసం అదివరకటి ప్రభుత్వాలు…

కొన్ని లక్షల మంది పేదల ఇళ్లలో దేవుడి పటాల మధ్య తన ఫోటోకు స్థానం సంపాదించుకున్న జననేతగా వైఎస్ రాజశేఖర రెడ్డికి గుర్తింపు ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో.. పేదలకోసం అదివరకటి ప్రభుత్వాలు చేయని కొత్త ఆలోచనలు చేశారు. కొత్త పథకాలు తెచ్చారు. తనకున్న పేదల మనిషి అనే గుర్తింపును శాశ్వతం, సార్థకం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి పాలన నడుస్తోంది. రాజన్న రాజ్యం తెస్తాం అనే హామీతో జగన్ అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వంలోని పెద్దలు మాత్రం జగన్, తన తండ్రి వైఎస్ఆర్ కంటె శక్తిమంతుడు అనే తరహాలో వ్యాఖ్యానిస్తున్నారు. ఒక రకంగా  ఇది  నిజమే అనిపిస్తోంది.

ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం నాడు వైకాపా పార్టీ కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ సంఘాల వారి సమావేశంలో ప్రసంగించారు. వైఎస్ఆర్- జగన్ పాలనల మధ్య ఉండే వ్యత్యాసాల గురించి ఆయన కొద్దిగా ప్రస్తావించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్క ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు కొన్ని పరిమితులు ఉండేవని, ఇప్పుడు జగన్ తాను సొంతంగా స్థాపించిన పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యారు గనుక.. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అర్థం వచ్చేలా సజ్జల అన్నారు. జగన్ ఆదేశాలను పార్టీ శిలాశాసనంలా పాటిస్తుందని, ఎక్కడ ఏ సమస్య వచ్చినా యంత్రాంగం మొత్తం వెంటనే స్పందిస్తోందని కూడా చెప్పారు.

నిజానికి కాంగ్రెస్ పార్టీనాయకుడిగా, వారికి దేశంలో ఉండే అనేక మంది ముఖ్యమంత్రుల్లో ఒకరుగా ఉన్నప్పటికీ ఆరోజుల్లో వైఎస్సార్ హవా వేరు. ఒక కోణంలోంచి చెప్పాలంటే.. వైఎస్సార్ మాటే కాంగ్రెస్ పార్టీకి చాలా సందర్భాల్లో శిరోధార్యంగా ఉండేది. ఆయన ప్లాన్ చేసిన పథకాలను కేంద్ర నాయకత్వం నుంచి వచ్చినట్లుగా ప్రకటించడమూ జరిగేదనే వాదన ఉంది. ఆ పార్టీలో అసమాన బలం ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

ఇప్పుడు సజ్జల మాటల్లో  ఆయనకు కూడా పరిమితులుండేవి అంటే.. ఇప్పుడు అలాంటి పరిమితులు లేకుండా జగన్ మరింత విస్తృతంగా ప్రజామోద నిర్ణయాలు తీసుకోగలరనే అభిప్రాయం కలుగుతోంది. ఇలాంటప్పుడు సహజంగానే.. వైఎస్సార్ చేసిన దానికంటె ఎక్కువగా.. ప్రజోపయోగ కార్యక్రమాలు జగన్ నుంచి రావాలనే సంగతి పార్టీ గుర్తుంచుకోవాలి. అప్పుడు జగన్ ను తండ్రిని మించిన తనయుడిగా ప్రజలందరూ కూడా ఆమోదిస్తారు.

పూజకి నో చాన్స్.. కారణం అదే

తనని కాపీ కొట్టాను అందుకే ఇంత పెద్ద హిట్ అయ్యింది