ఆకురౌడీ మాటలు వినిపిస్తున్నాయి తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సభల నుంచి. అధికార పార్టీ నేతలను ఫినిష్ చేస్తాం, చంపుతాం అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్లు ప్రకటిస్తూ ఉన్నారు. ప్రజా చైతన్య యాత్రలు అంటూ చంద్రబాబు నాయుడు టూర్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తీవ్రమైన మాటలు వాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో అనుచితమైన మాటలు మాట్లాడటం చంద్రబాబు నాయుడుకు అలవాటుగా మారిపోయింది.
బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు లేకి మాటలు ఉపయోగిస్తూ ఉండటం గమనార్హం. విధానపరంగా మాట్లాడాల్సిన పరిస్థితుల్లో ఉన్నా చంద్రబాబు నాయుడు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రమంలో తనను ఎవరూ ఏమీ చేయలేరని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లనే ఫినిష్ చేసే రోజు వస్తుందంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు నాయుడే అలా మాట్లాడుతూ ఉండటంతో పచ్చ పార్టీ కార్యకర్తల నోళ్లకు మరింత హద్దు లేకుండా పోతోంది.
చంద్రబాబు చేపట్టిన యాత్రలో ఒక చోట ఒక తెలుగుదేశం కార్యకర్త మంత్రి కొడాలి నానిని ఉద్ధేశించి తీవ్రంగా మాట్లాడాడు. వాడు, వీడు అంటూ మొదలుపెట్టి.. కొడాలి నానిని చంపాలి అంటూ ఆ తెలుగుదేశం కార్యకర్త వ్యాఖ్యానించడం విశేషం. అలా కార్యకర్తను చంద్రబాబు నాయుడు మరింత ఎంకరేజ్ చేశారు. అతడి పేరేమిటో అడిగి మరీ తెలుసుకుని.. చంద్రబాబు నాయుడు ఉత్సాహ పరిచారు. మంత్రిని చంపాలి అన్న తెలుగుదేశం కార్యకర్తకు అలాంటి మాటలు వద్దని, సంయమనంగా ఉండాలని చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు, అందుకు భిన్నంగా ప్రోత్సాహకంగా మాట్లాడారు. ఇలాంటి తీరు తెలుగుదేశం పార్టీ ఎంత అక్కసుతో ఉందో తెలియజేయడంతో పాటు, ఆకు రౌడీతనం ఆ పార్టీకి అలవాటుగా మారుతోందనే అభిప్రాయాలకు కారణం అవుతోంది.