అగ్ర రాజ్యాధిపతి భారత్ వచ్చారంటే.. ఆయను నుంచి కొన్ని హామీలు.. కొన్ని రకాల ప్రకటనలను ప్రభుత్వం ఆశిస్తుంది. అసలే అనేకానేక నిర్ణయాల విషయంలో వివాదాలను ఎదుర్కొంటున్న మోడీ సర్కారుకు ట్రంప్ నుంచి అలాంటి మద్దతు చాలా అవసరం. అయితే ఆ విషయంలో ఆయన అనుకున్నట్లుగా ట్రంప్ నుంచి ఏమైనా మాటలు వచ్చాయా? లేదా? అనేది సందేహమే. ఎందుకంటే.. విలేకర్ల సమావేశంలో ట్రంప్ చెప్పిన విషయాలు భారత్ కు అంత ప్రీతిపాత్రమైనవేమీ కాదు.
ప్రధానంగా సీఏఏ, కాశ్మీర్ భారత్ సంబంధాలు, 370రద్దు వంటి వ్యవహారాలపై అగ్రరాజ్యం అమెరికా తమకు అండగా ఉన్నదని ప్రపంచదేశాల ముందు చాటుకునే తహతహ మోడీకి ఉండొచ్చు. ఈ మూడు అంశాల్లోకి సీఏఏ అనేది కనిష్టమైన అంశంగా పరిగణించాలి. దానికి మాత్రం మోడీ సర్కారు ఆశించే తరహా సమాధానమే వచ్చింది. దానిని గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నలకు … సీఏఏ అనేది పూర్తిగా భారత అంతర్గత వ్యవహారం అని మోడీ సెలవిచ్చారు. ఇంతకంటె భిన్నంగా ఆయన మాట్లాడతారని ఆశించలేం కూడా.
అయితే కాశ్మీర్‌తో సంబంధాల విషయంలో మాటలే భిన్నంగా ఉన్నాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్ తోనూ నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి.. అని చెప్పుకొచ్చిన ట్రంప్ ఉద్రిక్తతలను సడలించడానికి.. రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి నేను సిద్ధం అంటూ తన సహజమైన భావనను బయటపెట్టారు. ఇది బహుశా మోడీ సర్కారుకు ఇష్టంలేని మాట.
ఎందుకంటే.. ప్రఫంచంలో ఏ ఇతర దేశం యొక్క మధ్యవర్తిత్వాన్నీ భారత్ కోరుకోవడం లేదు. ఈ విషయాన్ని మోడీ గతంలోనే పలుమార్లు స్పష్టం చేశారు. కానీ.. ట్రంప్ అదే మాట చెప్పారు. విలేకర్లు.. మోడీ వ్యతిరేకతను ప్రస్తావించిన వెంటనే.. తాను మధ్యవర్తిత్వం వహిస్తానని అనడం లేదంటూ.. ట్రంప్ మాట మార్చేందుకు ప్రయత్నించారు.
ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి తమ ప్రజలను రక్షించుకోవడానికి భారత్ అమెరికా దేశాలు రెండూ కలిసి పనిచేస్తాయన్న ట్రంప్, అదే సమయంలో.. సీమాంతర ఉగ్రవాదాన్ని నియంత్రించడానికి పాక్ చాలా కృషిచేస్తున్నదంటూ వారికి కితాబివ్వడం కూడా గమనార్హం. కనీసం 370 రద్దు గురించి అది భారత అంతర్గత వ్యవహారం అనే మాట ట్రంప్ నోటినుంచి వచ్చి ఉంటే గనుక.. మోడీ ప్రభుత్వానికి నైతికంగా చాలా బలం ఉండేది. కానీ.. అలాంటివి జరగలేదు. అందుకే ట్రంప్ మాటలు మోడీకి చేదుగుళికలేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.