టీజర్ రిలీజ్ చేశారు ఓకే. ట్రయిలర్ రిలీజ్ చేశారు. ఇది కూడా ఓకే. అంతా ఎదురుచూస్తున్న రీమిక్స్ ను మాత్రం కూరలో కరివేపాకులా పక్కన పడేసింది సవ్యసాచి యూనిట్. నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమాలోని “నిన్ను రోడ్డు మీద చూసినది” అనే హిట్ సాంగ్ ను రీమిక్స్ చేసి, ప్రచారానికి అస్సలు వాడుకోలేదంటే.. ఆ ఘనత సవ్యసాచి యూనిట్ దే.
నిజానికి ఈ సినిమా ప్రమోషన్ ను ఈ రీమిక్స్ నుంచే స్టార్ట్ చేస్తారని అంతా భావించారు. అలా చేసుంటే చాలా బాగుండేది కూడా. కానీ అలా జరగలేదు. పోనీ ఏదో ఒక టైమ్ లో రిలీజ్ చేస్తారని భావించారు. అది కూడా జరగలేదు. చివరికి జ్యూక్ బాక్స్ రిలీజ్ చేసి, ఏమాత్రం హంగామా లేకుండా 7 పాటల్లో ఒక పాటగా సూపర్ హిట్ రీమిక్స్ ను రిలీజ్ చేసి, ఓ మంచి ప్రమోషనల్ ఎలిమెంట్ ను వేస్ట్ చేసింది యూనిట్.
తెలుగు సినిమాల్లో రీమిక్స్ లు చాలానే వచ్చాయి. రిలీజ్ టైమ్ లో ఆ ఎలిమెంట్ ను మేకర్స్ బాగానే క్యాష్ చేసుకున్నారు కూడా. అలాఅని ఇది తీసిపారేసే రీమిక్స్ కంపోజిషన్ కూడా కాదు. తమన్ లా, కీరవాణి ఈ రీమిక్స్ అవకాశాన్ని వృధా చేయలేదు. తనదైన మార్క్ చూపించాడు. ఇలాంటి స్పెషల్ సాంగ్ ను గుంపులో గోవిందయ్యాలో జ్యూక్ బాక్స్ లో ఒకటిగా రిలీజ్ చేశారు.
మనంలో రీమిక్స్ సాంగ్ ను ప్రచారం టైమ్ లో నాగార్జున ఎలా వాడుకున్నాడో చూశాం. మగధీరలో రీమిక్స్ సాంగ్ టైమ్ లో నడిచిన హడావుడి ఇప్పటికీ చాలామందికి గుర్తే. ఈ రెండు సినిమాల మధ్యలో కూడా చాలా రీమిక్స్ సాంగ్స్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేశాయి. కానీ సవ్యసాచి విషయంలో మాత్రం రీమిక్స్ కు ప్రాధాన్యం ఇవ్వలేదు. బహుశా ఈ రీమిక్స్ బాణీ ఎవరికీ నచ్చలేదేమో.