సినిమా రివ్యూ: వీర భోగ వసంత రాయలు

రివ్యూ: వీర భోగ వసంత రాయలు రేటింగ్‌: 1.5/5 బ్యానర్‌: బాబా క్రియేషన్స్‌ తారాగణం: నారా రోహిత్‌, సుధీర్‌ బాబు, శ్రీవిష్ణు, శ్రియ శరన్‌, శ్రీనివాసరెడ్డి, శశాంక్‌, రవిప్రకాష్‌ తదితరులు సంగీతం: మార్క్‌ కె.…

రివ్యూ: వీర భోగ వసంత రాయలు
రేటింగ్‌: 1.5/5
బ్యానర్‌: బాబా క్రియేషన్స్‌
తారాగణం: నారా రోహిత్‌, సుధీర్‌ బాబు, శ్రీవిష్ణు, శ్రియ శరన్‌, శ్రీనివాసరెడ్డి, శశాంక్‌, రవిప్రకాష్‌ తదితరులు
సంగీతం: మార్క్‌ కె. రాబిన్‌
కూర్పు: శశాంక్‌ మాలి
ఛాయాగ్రహణం: ఎస్‌. వెంకట్‌
నిర్మాత: అప్పారావు బెల్లాన
రచన, దర్శకత్వం: ఇంద్రసేన ఆర్‌.
విడుదల తేదీ: అక్టోబర్‌ 26, 2018

మూడొందల మంది ప్రయాణిస్తున్న ఫ్లయిట్‌ మిస్‌ అవుతుంది. ఒక చిన్న పాప మార్కెట్‌లో అదృశ్యమవుతుంది. ఒక పిల్లాడి ఇల్లు పూర్తిగా కనిపించకుండా పోతుంది. ఈ మూడు మిస్టరీలని చేధించే బాధ్యత ముగ్గురు తీసుకుంటారు. స్పెషల్‌ ఆఫీసర్‌ (రోహిత్‌) ఫ్లయిట్‌ ఆనవాళ్లు తెలుసుకునే పనిలో వుంటే, ఎస్‌ఐ (సుధీర్‌) అదృశ్యమయిన ఇల్లు ఏమయిందా అని ఆరా తీస్తుంటాడు. కనిపించకుండా పోయిన పాప కోసం ఒక ప్రైవేట్‌ డిటెక్టివ్‌ (శశాంక్‌) ప్రయత్నిస్తుంటాడు.

ఈ సెటప్‌ అంతా ఆసక్తికరంగానే అనిపిస్తుంది. ఇంతమంది పేరున్న నటులు ఈ చిత్రంలో భాగం కావడానికి అంగీకరించారంటే ఖచ్చితంగా కథలో ఏదో ఆకర్షణ ఉండే వుంటుందిగా మరి. కాకపోతే కాగితంపై ఎక్సయిటింగ్‌గా అనిపించిన ఐడియా తెర మీదకి వచ్చే సరికి చిందర వందరగా, గందరగోళంగా తయారైంది. అసలు కథ తెలిసాక కానీ చాలా విషయాలకి అసలు సెన్స్‌ వున్నట్టే అనిపించవు. కానీ అసలు కథ పతాక సన్నివేశంలోనే తెలిసి వస్తుంది.

అప్పుడు రివైండ్‌ చేసుకుంటే అంతకుముందు అర్థం లేకుండా కనిపించిన కొన్ని సంఘటనలు ఇపుడు కాస్త అర్థవంతంగా తోస్తాయి. అసలు ఇంత కాంప్లికేటెడ్‌గా ఈ కథని చెప్పాల్సిన అవసరం ఏమిటి, అంతగా ప్రేక్షకులని కన్‌ఫ్యూజ్‌ చేసేంత పైశాచికత్వమెందుకు అంటే… స్ట్రెయిట్‌గా చెప్పేస్తే ఈ కథలో ఎలాంటి మేటర్‌ లేదు మరి. అందుకే నాన్‌-లీనియర్‌ ఫార్మాట్‌లో ఏదో విచిత్రాన్ని వీక్షిస్తోన్న భ్రమ కలిగించాలి. దర్శకుడి ఆలోచన మంచిదే కానీ దానిని చెప్పిన విధానమే ఈ చిత్రాన్ని అస్తవ్యస్తం చేసింది.

మూడు వందల మందితో మిస్‌ అయిన ఫ్లయిట్‌ని ఎవరో అగంతకుడు తానే తప్పించానంటాడు. పాసింజర్లు బతకాలంటే సమాజంలో వున్న మూడు వందల మంది క్రిమినల్స్‌ని మీరే మాస్‌ మర్డర్‌ చేయాలంటాడు. దీనికి ప్రభుత్వం అంగీకరించేయడమే కాకుండా అమలు కూడా చేసేస్తుంది! ఇలాంటి లాజిక్‌ లేని బోగస్‌ సన్నివేశాలకి ఇందులో లోటు లేదు. ఇల్లు మాయమైందనే దానికి ఇచ్చే వివరణ, అది ఎవరు చేసారని రివీల్‌ చేసినపుడు వచ్చే అనుమానాలకి దర్శకుడు ప్రతి ప్రేక్షకుడితో స్వయంగా కూర్చుని ఎక్స్‌ప్లెనేషన్‌ ఇస్తే కానీ అంతు చిక్కదు.

క్రిమినల్సు, పోలీసులు టెక్నాలజీని మంచి నీళ్లలా వాడేసిన తీరు చూసి పోలీస్‌ శాఖ సిగ్గుతో రద్దయిపోవాలి. ఉదాహరణకి పూర్తిగా మంటల్లో కాలిపోయి చావు బతుకుల్లో వున్నవాడు ఒక వ్యక్తి ఆనవాళ్లని స్పష్టంగా చెబితే స్కెచ్‌ ఆర్టిస్ట్‌ పర్‌ఫెక్ట్‌ స్కెచ్‌ వేసేస్తాడు. ఆ స్కెచ్‌ని కంప్యూటర్‌కి ఫీడ్‌ చేస్తే, అదే పోలికలు వున్న వ్యక్తి ఏ సిసిటివి కెమెరాల్లో తరచుగా కనిపిస్తున్నాడో, అది ఏ ఏరియానో ఇట్టే కనిపెట్టేస్తారు. ఎంత సినిమాటిక్‌ లిబర్టీ అయినా మరీ ఇంతలానా అనుకోవడం తప్ప చేసేదేమీ వుండదు. ఇలాంటి ఆణిముత్యాల్లాంటి సన్నివేశాలన్నిటి గురించి చెప్పుకుంటే అదే ఓ పురాణం అవుతుంది.

పతాక సన్నివేశంలో వచ్చే ట్విస్ట్‌ మీదే ఈ కథ మొత్తం బేస్‌ అయింది. పోనీ ఆ ట్విస్ట్‌ ఏమైనా కొత్తదా అంటే ఇటీవలే రెండు సినిమాల్లో సేమ్‌ ట్విస్ట్‌ వచ్చింది. మిస్టరీ థ్రిల్లర్స్‌ని తీర్చిదిద్దడంలో దర్శకుడికి ఫుల్‌ క్లారిటీ వుండాలి. ఏమి జరుగుతుందనేది స్పష్టంగా చూపిస్తూనే ఏమి జరిగిందనేది గెస్‌ చేస్తూ కుర్చీలకి అతుక్కుపోయేట్టు చేయాలి. కానీ తెరపై జరుగుతోన్న సన్నివేశాలని తీసిన విధానం వల్ల అక్కడ జరుగుతున్నది కానీ, అంతకుముందు ఏమి జరిగిందని కానీ, తర్వాత ఏమి జరుగుతుందని కానీ కాస్తయినా ఆసక్తి కలగక పోగా ఈ సంత త్వరగా ముగించు వసంతా అన్నట్టుంటుంది.

ఫైనల్‌ ట్విస్ట్‌ రివీల్‌ అయిన తర్వాత ఒకసారి రివైండ్‌ చేసుకుందామని, ఈ వీర భోగ వసంత రాయలి కథని ఒక పద్ధతిలో పెట్టుకుందామని ప్రయత్నించారో అంతే ఇక. అసలు ఇది ఎక్కడ మొదలయింది, ఎటు వెళ్లిందీ, ఎక్కడికి చేరింది అన్నది ఆలోచిస్తూ బుర్రలు బాదుకోక తప్పదన్నమాట. స్పాయిలర్స్‌ జోలికి వెళ్లడం తగదని కొన్ని అంశాలని చర్చకి తీసుకురావడం లేదు కానీ అసలు ఆ ఇల్లు మిస్సింగ్‌ పాయింట్‌ ఈ కథలోకి ఎందుకు వచ్చింది? ఎక్కడ్నుంచి ఎక్కడికి లింక్‌ చేసారు? ఆ ఏజ్‌ వాడు చేసాడు? ఎంత మంది కలిసి చేసారు? అన్నది ఆలోచిస్తే ఏమైనా అర్థముంటుందా? ఇదంతా చదువుతుంటే మీకెలా వుందో సినిమా చూస్తున్నపుడు కూడా అంతే క్లారిటీ వుండడం ఈ వసంత రాయలి స్పెషాలిటీ.

వున్న డైవర్షన్స్‌, డీవియేషన్స్‌, కన్‌ఫ్యూజన్స్‌ చాలవన్నట్టు శ్రీవిష్ణు చేత ఆ గెటప్‌ వేయించడం దేనికో? రూపు రేఖల్లో మార్పు చూపించిన శ్రీవిష్ణు వాచకంలో కూడా అందుకు తగ్గట్టు మార్పు చూపించాలని ప్రయత్నించకపోవడాన్ని ఏమనుకోవాలి? హార్డ్‌ కోర్‌ క్రిమినల్‌ క్యారెక్టర్‌ పోషిస్తూ 'నీదీ నాదీ ఒకేకథ' మాదిరి పక్కింటబ్బాయిని తలపించే డైలాగ్‌ డెలివరీ ఏమిటి? సుధీర్‌బాబు ఎందుకు డబ్బింగ్‌ చెప్పలేదనేది మరో మిస్టరీ. నిజానికి తనదే లెంగ్తీ క్యారెక్టర్‌. దాదాపుగా కథ మొత్తం తన చుట్టే తిరుగుతుంది.

నటన వరకు బాగానే చేసినా డబ్బింగ్‌ చెప్పుకోకుండా వదిలేయడం వల్ల తన పాత్రకి న్యాయం జరగలేదు. నారా రోహిత్‌కి ఇలాంటి పాత్రలు కొత్త కాదు. శ్రియా శరన్‌కి మాత్రం ఖచ్చితంగా కొత్తే. అవసరానికి మించిన బిల్డప్‌ ఇచ్చిన ఈ క్యారెక్టర్‌ని అలా కత్తిరించుకుంటూ పోయినా కానీ పెద్ద డిఫరెన్స్‌ వుండనంత ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌. నిర్మాణ విలువల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వున్న బడ్జెట్‌ మొత్తం నటీనటులకి ఇచ్చేసి నిర్మాణానికి పైకం మిగుల్చుకున్నట్టు లేరు.

దీంతో నేరాలు ఘోరాలు ఎపిసోడ్‌కి ఎక్కువ, షార్ట్‌ ఫిలింకి తక్కువ రేంజ్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌తో తారాగణంపై జాలి పడేట్టు తయారైంది. జీనియస్‌ వర్గానికి అప్పీల్‌ అవుతుందని, కల్ట్‌ ఫేవరెట్‌ అవుతుందని దర్శకుడు ఇంద్రసేన బలంగా నమ్మేసాడు. అలా అనిపించుకోవాలనే ఈ సినిమాని పట్టుబట్టి మరీ ఇలా తీసినట్టున్నాడు. కానీ ఇది రెంటికీ చెడ్డ రేవడిలా తయారై ఎవరికీ పట్టని సినిమాగా షేప్‌ తీసుకుంది.

బాటమ్‌ లైన్‌: వీర 'బోగస్‌' వసంత రాయలు!
-గణేష్‌ రావూరి

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి