శాంతి భద్రతల పరంగా సున్నితమైన విషయాల్లో నాయకులు చాలా బాధ్యతగా మాట్లాడాలి. ఆ మాటకొస్తే అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నాయకులు మరింత బాధ్యతగా మాట్లాడాల్సి ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్లో విధ్వంస ఆలోచనలు ఉంటే.. వారు అల్లర్లనే కోరుకుంటారు. ఏదైనా సునిశిత అంశం తెరపైకి వచ్చినప్పుడు రెచ్చగొట్టే ప్రసంగాలూ అటువైపునుంచి ఉంటాయి. కానీ అధికారంలో ఉన్నవారు.. ఎంతో సంయమనంతో బాధ్యతతో ఆచితూచి మాట్లాడాలి.
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అలాంటి సంయమనం అధికార పార్టీ నాయకుల్లో తగ్గిపోయింది. భాజపా వారే.. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేయడం.. చాలా రివాజు అయిపోయింది. ఇలాంటివి అడపాదడపా జరగవచ్చు. అలాంటి నాయకులపై పార్టీ అధిష్టానం కనీసం కఠినచర్యలు తీసుకుంటే.. రానురాను పరిస్థితులు మెరుగుపడతాయి. అలాంటి చర్యలు భాజపా ఎన్నడూ తీసుకున్న దాఖలాలు లేవు.
దాని పర్యవసానమే ఇవాళ దేశ రాజధాని అల్లర్లతో అట్టుడుకుతుండడం. సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. సీఏఏ అనేది దేశంలోని ముస్లింలకు వ్యతిరేకం కాదు, భవిష్యత్తు గురించి కూడా వారు ఎలాంటి భయం చెందవలసిన అవసరం లేదు అని నమ్మించే ప్రయత్నం చేయకుండా.. భారతీయ జనతా పార్టీ, కేవలం ఆ ఆందోళనలను అణచివేయడానికి మాత్రమే ప్రయత్నిస్తోంది.
సీఏఏ మద్దతు దారులను ఉద్దేశించి భాజపా నేత కపిల్ మిశ్రా రెచ్చగొట్టే ప్రసంగలు చేయడం చాలా ఘోరాలకు దారితీసింది. నిరసనకారుల్ని మూడురోజుల్లో ఖాళీ చేయించాలని ఢిల్లీ పోలీసులకు ఆయన డెడ్ లైన్ పెట్టారు. సీఏఏ మద్దతు దారుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడారు. పర్యవసానం ఇరువర్గాల ఘర్షణలకు దారితీసింది. ఒక పోలీసు సహా ఏడుగురు మరణించారు.
ఇప్పుడు కపిల్ మిశ్రాపై భాజపాకే చెందిన ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. వ్యక్తులు ఎవరైనా సరే.. ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినప్పుడు, వారి మీద కఠిన చర్యలు ఉండాల్సిందే అని అంటున్నాడు. పోలీసులకే రక్షణ లేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటని హెచ్చరిస్తున్నాడు.. మరి.. సొంత పార్టీ నేతల నుంచే ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నప్పుడైనా.. భాజపా స్పందించాలి. తమ పార్టీలో నోటిదూకుడు ఉన్న తెంపరితనం ఉన్న నాయకులకు కళ్లేలు వేయాలి. లేదా ప్రజలు ఆ పార్టీని అసహ్యించుకునే రోజు వస్తుంది.