1978లో అనంతపురం ఆకాశంలో ఒక హెలికాప్టర్ ఎగిరింది. ఆ రోజుల్లో సినిమాల్లో తప్ప నిజంగా హెలికాప్టర్ కనబడడం అరుదు. స్టేడియంలో ల్యాండ్ అయిన దాన్ని చూడడానికి వూళ్లోని పిల్లలంతా గుంపులుగుంపులుగా పరిగెత్తారు. విషయం ఏమంటే రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పర్యటన కోసం ముందస్తు ఏరియల్ సర్వే జరిగింది.
తాను చదివిన అనంతపురం ఆర్ట్స్ కళాశాల ఉత్సవాలకి రాష్ట్రపతి హోదాలో ఆయన వచ్చారు. ఏ కాలేజీకైనా అదో మరిచిపోలేని జ్ఞాపకం. అనంతపురం కాలేజీ నుంచి 1916 మొదలు ఇప్పటి వరకు ఎన్నో ఉన్నతస్థానాలు చేరుకున్న విద్యార్థులు ఉండొచ్చు కానీ, రాష్ట్రపతి అయ్యింది సంజీవరెడ్డి ఒకరే.
నేను ఇంటర్ విద్యార్థి అప్పుడు. ఆయన కోసం భారీ బందోబస్తు వుండింది కానీ, గంటలు గంటలు ట్రాఫిక్ ఆపడం, దుకాణాలు మూయించడం జరగలేదు. కాలేజీలో ఘన స్వాగతం లభించింది. విద్యార్థిగా జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ “అనంతపురం ప్రజలంటే నాకు చాలా ఇష్టం. ఇకపై జీవితంలో ఎపుడూ వాళ్లని ఓట్లు అడిగే ఖర్మ నాకు పట్టదు” అని చమత్కారం విసిరారు. కారణం తెలియదు కానీ ఎన్నికల్లో అనంతపురం ఆయన్ని పెద్దగా ఆదరించలేదు. 1971లో శిష్యుడు ఆంథోనిరెడ్డి చేతిలో ఓడడం పెద్ద షాక్.
రాజకీయాలు వదిలేసి ఇల్లూరులో జామతోటల వ్యవసాయం చేసుకుంటున్న నీలం, మళ్లీ జయప్రకాశ్‌నారాయణ్ పిలుపు మేరకు నంద్యాల నుంచి పోటీ చేశారు. తర్వాత స్పీకర్, రాష్ట్రపతి, మిగతా అంతా చరిత్ర.
బస్సుల జాతీయకరణ వివాదంలో కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి నీలం. తర్వాత జాతీయ రాజకీయాల్లో కేంద్రమంత్రిగా, స్పీకర్‌గా చేశారు. స్పీకర్ అంటే ఇప్పటి టైప్ కాదు. సొంత వ్యక్తిత్వం, నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. వాజ్‌పేయ్ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఇందిరమ్మ ప్రభుత్వంపై ఆమోదించిన స్పీకర్.
1969లో రాష్ట్రపతిగా పోటీ చేస్తే, ప్రధాని ఇందిరాగాంధీ ఆత్మ ప్రబోధం మేరకు ఓటు వేయాలని వీవీ గిరిని పోటీగా పెట్టింది. సొంత పార్టీ చేతిలోనే సంజీవరెడ్డి ఓడిపోయారు. అదే వ్యక్తి 1980లో రాష్ట్రపతిగా ఇందిరాగాంధీతో ప్రమాణస్వీకారం చేయించారు.
పదవీ విరమణ తర్వాత చాలా కాలం అనంతపురంలో ఉన్నారు. ఆయన బంగ్లా ఎంత సాదాసీదాగా ఉండేదంటే ఒక పెద్ద రైతు ఇల్లులా వుండేది. ఎమ్మెల్యేలు కూడా రాజప్రసాదాలు నిర్మించుకుంటున్న ఈ రోజులతో పోలిస్తే ఆయన ఎంత నిరాడంబర నాయకుడో అర్థమవుతుంది.
ఆయన అల్లుళ్లలో ఒకరు మాత్రం కొంత కాలం మంత్రిగా వున్నారు. సంజీవరెడ్డి రాష్ట్రపతి భవన్లో చేరుతున్నపుడు ఆయన కూతుళ్లు తెలుగు సాంప్రదాయం ప్రకారం ముందు రోజు పాలు పొంగించారు. అప్పటి పత్రికలు ప్రత్యేకంగా ఈ వార్తను వేశాయి.
ఆయన కుమారుడు సుధీర్‌రెడ్డి సర్జన్. తండ్రి పలుకుబడితో ఢిల్లీ, ముంబయ్లాంటి నగరాల్లో పెద్ద కార్పొరేట్ ఆస్పత్రి యజమాని అయ్యే శక్తి వున్నప్పటికీ, సాదాసీదా చిన్న ఆస్పత్రిని అనంతపురం సప్తగిరి సర్కిల్లో నిర్వహించేవాడు. వైద్యాన్ని సేవగా , బాధ్యతగా చేసిన వారు తప్ప, డబ్బు కోసం చేసినవాడు కాదు.
మేము సైకిళ్లలో కాలేజీకి వెళుతున్నపుడు సప్తగిరి సర్కిల్లో సాదాసీదాగా ఎవరో రోగుల్ని పలకరిస్తూ కనిపించేవాడు. మన దేశ ప్రెసిడెంట్ కుమారున్ని మేమే కాదు, వచ్చి పోయే జనం కూడా ఆశ్చర్యంగా నిలబడి చూసేవాళ్లం.
తరువాతి తరం అంటే మనుమళ్లు, మునిమనుమళ్ల గురించి తెలియదు కానీ, తాతగారి పేరు చెడగొట్టేలా ఎపుడూ వార్తల్లో కనిపించలేదు.
అనంతపురం ఆయన్ని ఓడించినా, ఆ వూరు అంటే నీలం సంజీవరెడ్డికి విపరీతమైన ఇష్టం, అయిష్టంగానే వైద్యం కోసం చివరి రోజుల్లో బెంగళూరు వెళ్లి అక్కడే తుదిశ్వాస విడిచారు.
జీఆర్ మహర్షి