బలగం పొట్టి సీతయ్య గుర్తున్నాడు కదా…ఈ క్యారెక్టర్ భలేగా వుంటుంది. తమకు కిట్టని వాడు ఏం చేసినా తప్పే. ఇప్పుడు ‘సామాజిక మీడియా’ బాధ ఇలాగే వుంది. తెలుగుదేశం పార్టీతో సామాజిక బంధాలు పెనవేసుకున్న ఈ సామాజిక మీడియా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం పై తెగ బాధపడిపోతోంది.
అభిమానాలు, ఆప్యాయతలకు నెలవైన కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడం జగన్ రాఙకీయం తప్ప వేరు కాదు అంటూ బాధపడిపోతోంది. నిజానికి కొత్త జిల్లాలు ప్రకటించినపుడు ఒక్క జిల్లాకు కూడా అంబేద్కర్ పేరు పెట్టలేదని బాధపడిపోయింది ఈ సామాజిక మీడియానే.
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలని అప్పట్లో డిమాండ్ కూడా వినిపించింది. అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటు అయింది. తూర్పు గోదావరి జిల్లా అంటే కాపులు మాత్రమే కాదు కదా? అన్ని వర్గాలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే వున్నాయి. కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ ఇలా అన్ని వర్గాలు బలంగానే వున్నాయి. అదే విధంగా ఎస్సీ లు కూడా గణనీయంగా వున్నారు.
పైగా అంబేద్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ కూడా అక్కడి నుంచే వచ్చింది. అందువల్ల కూడా జగన్ ఈ నిర్ణయం తీసుకుని వుండొచ్చు. ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీకి దాని అనుకూల సామాజిక మీడియాకు రుచించకపోయి వుండొచ్చు.
ఎందుకంటే కాపులకు, ఎస్సీలకు ఈస్ట్ గోదావరిలో కాస్త వైరుధ్యం వుంది. జనసేనతో తెలుగుదేశం అంటకాగితే ఎస్సీలు కచ్చితంగా దూరం జరిగే అవకాశం వుంది. ఇప్పుడు ఈ పేరు పెట్టడం అన్నది ఈ వ్యవహారానికి మరింత ఊపు ఇస్తుంది.
బహుశా అందుకే ఈ బాధ అంతా కావచ్చు. కానీ ఈ సామాజిక మీడియా ఇలా గోల పెట్డడం మరింత ప్లస్ అవుతుంది కానీ మైనస్ కాకపోవచ్చు.