తెలివి లేని విద్యామంత్రి

దేశంలోనే మిగ‌తా ప్రాంతాల కంటే బెంగాల్ ఒక్క అడుగు ముందు వుంటుంద‌ని ఒక‌ప్పుడు అనేవాళ్లు. క‌ళ‌లు, సాహిత్యం, సినిమా అన్నింటిలో బెంగాల్ వాళ్లు ఆద‌ర్శ‌ప్రాయం. బెంగాల్ న‌వ‌ల‌లు సినిమాలుగా వ‌చ్చాయి. మ‌నం ఎంతో ఇష్ట‌ప‌డే…

దేశంలోనే మిగ‌తా ప్రాంతాల కంటే బెంగాల్ ఒక్క అడుగు ముందు వుంటుంద‌ని ఒక‌ప్పుడు అనేవాళ్లు. క‌ళ‌లు, సాహిత్యం, సినిమా అన్నింటిలో బెంగాల్ వాళ్లు ఆద‌ర్శ‌ప్రాయం. బెంగాల్ న‌వ‌ల‌లు సినిమాలుగా వ‌చ్చాయి. మ‌నం ఎంతో ఇష్ట‌ప‌డే దేవ‌దాసు కూడా బెంగాలీ వాడే.

బెంగాల్ ప‌రువు పూర్తిగా మ‌ట్టిలో క‌లిపే ఒక ప‌ని ఇటీవ‌ల జ‌రిగింది. మ‌మ‌తా స‌ర్కార్‌లోని విద్యాశాఖ స‌హాయ మంత్రి పేరు ప‌రేష్ అధికారి. ఆయ‌నేం చేశారంటే త‌న కూతురికి టీచ‌ర్ పోస్టు వేయించుకోడానికి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డాడు. ఆ అమ్మాయికి త‌క్కువ మార్కులు వ‌చ్చినా పోస్టింగ్ ఇచ్చాడు. ఎక్కువ మార్కులు వ‌చ్చిన అమ్మాయి కోర్టుకు వెళ్లింది. దాంతో కోర్టు అత‌న్ని ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌మ‌ని ఉత్త‌ర్వులు ఇచ్చింది.

టీచ‌ర్ ఉద్యోగ‌మంటే ఎంత‌? మ‌హా అయితే స్టార్టింగ్‌లో 10-20వేలు వస్తాయి. ఆ ఉద్యోగం కోసం అక్ర‌మాల‌కు పాల్ప‌డినాడంటే అమాయ‌క‌త్వ‌మా?  కాదా? మ‌న తెలుగు రాష్ట్రాలు, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడుని ఒక‌సారి చూడండి. 

మంత్రులు కానీ, వాళ్ల పిల్ల‌లు కానీ ఇట్లాంటి చిన్న విష‌యాలు ప‌ట్టించుకుంటారా? స‌ర్పంచ్‌లు కూడా ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేసి కోట్లు కూడ‌బెడుతుంటే, ఎమ్మెల్యేలు నాలుగు త‌రాల‌కి స‌రిపోయేంత సంపాదిస్తుంటే కొంచెం కూడా బుర్ర లేకుండా టీచర్ ఉద్యోగానికి త‌ప్పు చేస్తాడా?

మా రాష్ట్రాల‌కు వ‌చ్చి నాయ‌కుల్ని చూడండి. ఎవ‌రైనా వాళ్ల పిల్ల‌ల్ని టీచ‌ర్లు చేయాల‌నుకుంటున్నారా? అస‌లు ఉద్యోగాలే చేయ‌నివ్వ‌డం లేదు. వాళ్ల‌ని రాజ‌కీయాల్లో వ‌దిలి ట్రైనింగ్ ఇస్తున్నారు.

బెంగాల్ వాళ్లు ఏంటి ఇంత తెలివి తక్కువ వాళ్లు అయిపోయారు?  మారండ్రా బాబూ. అప్‌డేట్ అవండి. లేదంటే మా రాష్ట్రాల‌కు వ‌చ్చి చూసి వెళ్లండి.

జీఆర్ మ‌హ‌ర్షి