రాజకీయాలు అంటే కులం…కులాల సమతూకం. అది అనివార్యమైన ఈక్వేషన్. పార్టీ పదవులైనా, అధికార పదువులైనా కులాల తూకం చూడక తప్పదు.
ఓసీ కులాలు, బిసి కులాలు, కాపులు, ఇతర కులాలు అన్నది ఆంధ్రలో కామన్ ఫార్ములా. ఈసారి నాలుగు రాజ్యసభ స్ధానాలు వస్తే కమ్మ..కాపు కులాల సంగతి పక్కన పెట్టారు వైకాపా అధినేత జగన్.
ఒకపక్క జనసేన సమరానికి కాలు దువ్వుతుంటే కాపులను మచ్చిక చేసుకోవాలనే ఆలోచన చేస్తారు ఎవరైనా. కానీ జగన్ ఆ విషయంలో ఆది నుంచీ డిఫరెంట్ గా వర్క్ చేస్తున్నారు.
తమకు దూరంగా వున్నవారిని బుజ్జగించినా, మచ్చిక చేసుకుందామనుకున్నా ప్రయోజనం వుండదనే భావనకు జగన్ వచ్చినట్లు కనిపిస్తోంది. కమ్మ వారు తెలుగుదేశంతో, కాపు సామాజిక వర్గం జనసేనతో కలిసి కదులుతున్నారు.
పది శాతం అటు ఇటు వుంటుందేమో కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ వర్గాల ఓట్లు వైకాపాకు ఏ మేరకు దక్కుతాయన్నది అనుమానమే. ఎక్కడైనా కాపు అభ్యర్ధులు వుంటే ఆ వర్గం ఓట్ల సాధన అన్నది వారు చూసుకుంటారు.
అందుకే బిసి లతోనే ముందుకు సాగాలని జగన్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. బిసి నేత ఆర్ కృష్ణయ్య ను నేరుగా ఎంపిక చేయడం అంటే అదే అనుకోవాలి. ఇదే టైమ్ లో ఓ కాపు నేతకు కూడా ఇస్తారన్న టాక్ వినిపించింది.
చలమలశెట్టి సునీల్ పేరు పరిశీలనలో వుందనీ వార్తలు వచ్చాయి. కానీ ఇద్దరు రెడ్లకు ఇవ్వక తప్పని పరిస్థితుల్లో జగన్ ఈ విధంగా ముందుకు వెళ్లారేమో?
బిసిలు, తనను నమ్ముకున్నవారు, తనకు విశ్వాస పాత్రులు ఇవే ప్రాధాన్యతలుగా చాలా కాలంగా జగన్ ఎంపిక కొనసాగుతోంది. కమ్మ, కాపు తరువాత జగన్ కాస్త చిన్న చూపు చూస్తున్న వారిలో క్షత్రియులు కూడా వున్నారు. రఘురామకృష్ణం రాజు, అశోక్ గజపతి రాజు ఉదంతాలతో జగన్ ఇలా మారిపోయి వుండొచ్చు.