తాజాగా ప్రకటించిన రాజ్యసభ సభ్యుల జాబితాలో అలీకి చోటు దక్కలేదు. దీనిపై వరుస కథనాలొచ్చాయి. కొన్ని మీడియా సంస్థలైతే అలీ చాలా బాధపడ్డారని, మరికొన్ని ఛానెల్స్ అయితే అలీ, వైసీపీకి దూరమయ్యేలా ఉన్నారంటూ వార్తలు ప్రసారం చేశాయి.
టీడీపీకి చెందిన ఎల్లో సోషల్ మీడియాలోనైతే జగన్, అలీని మోసం చేశారంటూ ఇష్టమొచ్చినట్టు విషపు రాతలు రాసేసింది. ఈ మొత్తం వ్యవహారంపై అలీ స్పందించారు. అసలు తనకు జగన్ ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు..
“నన్ను హీరోగా మార్చింది ఎస్వీ కృష్ణారెడ్డి గారు. నన్ను పూర్తిస్థాయి పొలిటీషియన్ గా మారుస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది ఏదేదో ఊహించుకుంటున్నారు. జగన్ గారు నాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఫలానా రాజ్యసభ సీటు నీకిస్తా అని నాకెప్పుడూ చెప్పలేదు. నామీద నమ్మకం పెట్టుకో అని మాత్రమే అన్నారు. అదే నమ్మకంతో ఉన్నాను.”
ఇలా తనపై నడుస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు అలీ. రాజ్యసభ సీటు రానందుకు తానేం ఫీలవ్వలేదని చెబుతూనే.. తనకు సంబంధించి అధిష్టానంతో టాక్స్ నడుస్తున్నాయని స్పష్టం చేశారు.
“టాక్స్ నడుస్తున్నాయి. ఏదో ఒక రోజు నాకు పిలుపొస్తుంది. ఏదో ఒక రోజు కాల్ వస్తుంది. అప్పుడు మీడియా సమక్షంలోనే ఆ శుభవార్తను అందరితో షేర్ చేసుకుంటాను. అప్పటివరకు అంతా ఓపిగ్గా ఉండాలి.”
జగన్ హామీ ఇచ్చిన తర్వాత తనకు రాజ్యసభ సీటు రాకపోతే బాధపడతానని, కానీ తనకు జగన్ నుంచి అలాంటి హామీ లేదని అలీ ఓపెన్ గా ప్రకటించారు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ తను జగన్ మనిషినని.. తనను ఎలా చూసుకోవాలో ముఖ్యమంత్రికి బాగా తెలుసంటూ అంతటితో ఆ టాపిక్ ను ముగించారు.