హారిక హాసిని సంస్థ ఈ మధ్యనే అంటే కొన్నినెలల క్రితం ఆఫీసు మార్చింది. పాత ఆఫీసు చిన్నదిగా వుండడం, కుటుంబాలు నివసించడానికి వాడే అపార్ట్ మెంట్ సముదాయంలో వుండడంతో, శ్రీనగర్ కాలనీ, సాగర్ సొసైటీలో మాంచి భవంతిని నెలకు రెండున్నర లక్షల అద్దెతో ఆఫీసుకు తీసుకున్నారు. ఇటు హారిక హాసినికి, అటు దర్శకుడు త్రివిక్రమ్ కు నమ్మకాలు చాలా ఎక్కువ. అందుకే అన్నీ వాస్తులు చూసి మరీ తీసుకున్నారు.
ఇప్పుడు వ్యవహారం చూస్తుంటే ఈ వాస్తు బానే కలిసివచ్చినట్లు కనిపిస్తోంది. ఈ బిల్డింగ్ లోకి వచ్చాక శైలజారెడ్డి అల్లుడు విడుదలయింది. సినిమా యావరేజ్ గా మిగిలింది కానీ, బిజినెస్ బాగా జరిగింది. అన్నీకలిపి పదికోట్ల వరకు లాభం చేసుకున్నారని వినికిడి.
సినిమాను కొనుక్కున్నవారికి పెద్దగా పోయింది లేదు. పది నుంచి ఇరవై శాతం లాస్ అన్నది కామన్ కాబట్టి, వెనక్కు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేకపోయింది. పైగా అలా కొనుక్కున్నవారే అరవింద సమేత వీరరాఘవ కూడా కొనుక్కున్నారు కాబట్టి, పని సులువు అయింది.
అరవింద సమేత వీరరాఘవకు కూడా మంచి పేరు వచ్చింది. మధ్యలో కలెక్షన్లు కాస్త డ్రాప్ అయినా మళ్లీ తరువాత ఫరావలేదనిపించుకున్నాయి. మరో రెండువారాల దాకా సరైన సినిమా లేదు. అందువల్ల ఒకటి రెండు మినహా అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయిపోతాయి. ఈ ప్రాజెక్టులో దాదాపు 40 కోట్ల వరకు లాభాలు వచ్చినట్లు ఇండస్ట్రీ టాక్.
మరో రెండు క్రేజీ ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. హను రాఘవపూడి.. శర్వానంద్ ఒకటి, నాని ప్రాజెక్టు మరొటి. ఇదికాక బన్నీ ప్రాజెక్టు టాక్స్ నడుస్తున్నాయి. నితిన్ భీష్మ పెండింగ్ లో వుంది. మొత్తానికి హారిక హాసిని టైమ్ మారినట్లు కనిపిస్తోంది వాస్తు సరిపోయే బిల్డింగ్ లోకి మారాక.