దాడులకు దిగితే అమరావతికే మరింత చేటు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేది అమరావతి నగరం లో మాత్రమే ఉండాలని డిమాండ్ తో  29 గ్రామాల ప్రజలు దాదాపు రెండు నెలలకు పైగా కొనసాగిస్తున్న దీక్షలు పోరాటాలు ఆందోళనలు తప్పుదారి పడుతున్నాయి.  తమ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేది అమరావతి నగరం లో మాత్రమే ఉండాలని డిమాండ్ తో  29 గ్రామాల ప్రజలు దాదాపు రెండు నెలలకు పైగా కొనసాగిస్తున్న దీక్షలు పోరాటాలు ఆందోళనలు తప్పుదారి పడుతున్నాయి.  తమ ఆవేదనను,  కష్టాన్ని నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడం… చేతనైతే ప్రభుత్వం పునరాలోచించుకునే  ప్రయత్నం చేయడం… లేదా తమ కష్టానికి తగిన విధంగా పరిహారం పొందే ప్రయత్నం చేయడం జరగాలి.  కానీ దారి తప్పి పోయిన ఆందోళనలు నాయకుల మీద  దాడుల స్థాయికి దిగజారుతున్నాయి. ఇలాంటి దుర్ఘటనల పర్యవసానం ఆందోళనలకే చేటు చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కొన్ని రోజుల కిందట నాగార్జున యూనివర్సిటీ లో ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతున్న ఏపీఐఐసీ చైర్మన్ రోజా కారును నిరసనకారులు అడ్డుకున్నారు.  ఆ సందర్భంగా చాలా రాద్దాంతం జరిగింది.   జై అమరావతి అనే నినాదం  పలక వలసిందిగా  రోజా మీద ఒత్తిడి తెచ్చారు.  ఆమె నిరాకరించడంతో ధర్నా చేశారు.

తాజాగా ఎంపీ నందిగం సురేష్ ఈ విషయంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది.  ఇటు ఆందోళనకారులు, అటు ఎంపీ అనుచరులు శృతిమించి వ్యవహరించడంతో ఇరువర్గాలు దొమ్మీకి తలపడే పరిస్థితి వచ్చింది.  కొట్టుకున్నారు. ఈ ప్రాంతంలో తమను తిరగనివ్వరా, అసెంబ్లీకి కూడా మేము రావాల్సిన అవసరం లేదా…  అంటూ ఎమ్మెల్యే రోజా తను ప్రతిఘటించిన తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇవాళ నందిగం సురేష్ ఏకంగా తమను హత్య చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.  చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను పురిగొల్పి తమ మీద హత్యలకు  ఎగదోలుతున్నారని ఆరోపిస్తున్నారు.  అమరావతి ముసుగులో ఆందోళన చేస్తున్న వారు హింసకు దిగుతున్నారని ఈ వాదనలకు బలం పెరుగుతోంది.  ఇది మంచి పరిణామం కాదు.

ప్రస్తుతానికి అమరావతి ప్రాంతంలో శాసన రాజధానిని కొనసాగించాలి అనే నిర్ణయంతో జగన్ ప్రభుత్వం ఉంది.  నాయకుల మీద దాడులు ఇదే తరహాలో మరిన్ని జరిగితే గనుక… అసెంబ్లీని కూడా తరలించే చేసే ప్రమాదముంది.  ఇప్పుడు చేస్తున్న ఆందోళనలకు మించి ఇంకొక ఆందోళన చేయలేని ప్రజలు… అప్పుడిక కొత్తగా ఎలాంటి ఒత్తిడి తేలేరు. సామరస్యంగా సాధించలేనిది, హింసతో అసలు సాధ్యం కాదని ఆందోళనకారులు తెలుసుకోవాలి.

సంక్షేమ పథకాలు రాష్ట్రానికి క్షేమమేనా?