హీరోల సినిమాలు షూటింగ్ లో వున్న టైమ్ లో సెట్ కు వచ్చి కలిసి వెళ్లడం అన్నది సినిమా జనాలకు సాధారణంగా వున్న అలవాటు. సెట్ లో అయితే షూటింగ్ గ్యాప్ లో ఈజీగా కలిసేయవచ్చు. ప్రత్యేకంగా అపాయింట్ మెంట్ కోసం వెదుక్కోనక్కరలేదు. సో ఈ వ్యవహారం కామన్. ఇలా కలవడంలో ఏదో ఒక అర్థం, పరమార్థం కొంత మందికి వుంటాయి. అలాంటి వ్యవహారాలు వేరు.
ప్రస్తుతం ఇలాంటి వ్యవహారంతోనే సీనియర్ దర్శకుడు శ్రీనువైట్ల లోకేషన్ కు వెళ్లి మెగాస్టార్ చిరంజీవిని కలిసినట్లు తెలుస్తోంది. వరుసగా ఫ్లాపులు ఇస్తూ వస్తున్నారు శ్రీనువైట్ల. చాలా మంది సీనియర్ దర్శకులు, లేదా చేయి తిరిగిన దర్శకుల మాదిరిగానే ఆయనకు కూడా స్క్రిప్ట్ నే సమస్య. సరైన బౌండ్ స్క్రిప్ట్ చేతికి ఇస్తే దున్నేయగలరు వీళ్లంతా. కానీ స్వంత స్క్రిప్ట్ లు చేస్తుంటే బెడిసికొడుతున్నాయి.
మిస్టర్, అమర్ అక్బర్ ఆంథోని సినిమాలు చూస్తే ఈ పరిస్థితి అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలో శ్రీను వైట్ల సినిమా కోసమే మెగాస్టార్ ను కలిసారా? లేక జస్ట్ క్యాజువల్ గా కలిసారా? అన్నది తెలియదు. సినిమా ప్రయత్నాల్లో భాగంగానే శ్రీనువైట్ల మెగాస్టార్ ను కలిసారని వినిపిస్తోంది. బి గోపాల్ కు బాలయ్య చాన్స్ ఇచ్చినట్లు, శ్రీను వైట్లకు మెగాస్టార్ చాన్సిస్తారా ? ఏమో?