నోటికొచ్చిన అబద్ధాలు చెప్పడం, చేతికొచ్చిన అబద్ధాలు రాసేయడం ఆంధ్రజ్యోతికి అలవాటే. అలాంటి అలవాటుతో వైసీపీపై, జగన్ పై దుష్ప్రచారం చేస్తూనే ఉంది చంద్రజ్యోతి. అయితే ఈ అలవాటే ఇప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణ కొంప ముంచబోతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 కోట్ల రూపాయలు కక్కేయాల్సిన సమయం వచ్చేసింది.
టీటీడీ పరువుకి భంగం కలిగించేలా తప్పుడు కథనాలు ఇస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి పత్రికపై ఏకంగా రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేసినట్టు తెలిపారు బీజేపీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి.
టీటీడీపై కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సుబ్రహ్మణ్య స్వామి. తిరుపతి కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై ఈరోజు పిటిషన్ దాఖలు చేసినట్టు చెప్పారు. చంద్రబాబు కాపాడుతారనుకుంటున్నారేమో.. అలాంటి ఆశలేవీ పెట్టుకోవద్దని పరోక్షంగా హెచ్చరించారు కూడా.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టీటీడీపై ఆంధ్రజ్యోతి వెర్షన్ ఒకరకంగా ఉండేదని, బాబు ఓడిపోయిన తర్వాత టీటీడీ పాలకమండలి మారిన తర్వాత బురదజల్లడం మొదలు పెట్టిందని చెప్పారు స్వామి. కుల మతాల మధ్య చిచ్చుపెట్టేలా కథనాలు వండి వార్చారని కూడా విమర్శించారు.
కుట్రపూరితంగానే జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తన జీవితంలో తానెప్పుడూ పరువునష్టం దావా కేసు ఓడిపోలేదని చెప్పిన సుబ్రహ్మణ్య స్వామి.. ఈ కేసు కూడా గెలవబోతున్నామని, ఆంధ్రజ్యోతితో 100కోట్లు కక్కిస్తానని సవాల్ చేశారు.