మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్ లోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లకూడదని, ఒకవేళ ఓటర్ల వద్ద ఫోన్లు ఉంటే లోపలికి పంపించొద్దని ఆదేశాలిచ్చారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఒకవేళ పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్తే సీజ్ చేయాలని మరీ చెప్పారు. అయితే ఈ తలతిక్క నిర్ణయంతో గంటల వ్యవధిలోనే ఆయన అభాసుపాలయ్యారు.
సహజంగా పోలింగ్ కేంద్రంలో ఎవరికి వారు సొంతంగా ఫొటోలు దిగకూడదని, ఓటు ఎవరికి వేశారో తెలిసేట్టు ఫొటోలు బయట పెట్టకూడదనేది రూలు. అయితే ఏకంగా ఓటర్ల సెల్ ఫోన్లపైనే నిషేధం విధించడంతో అందరూ మండిపడ్డారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే వారి దగ్గర సెల్ ఫోన్లు సేకరించాలని చూసిన సిబ్బందిపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తామెవరికీ సెల్ ఫోన్ ఇవ్వబోమని, లోపలికి తీసుకెళ్తామని చెప్పారు. అయితే సిబ్బంది అంగీకరించకపోవడంతో ఓటర్లు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు కూడా. దీంతో పోలింగ్ శాతం తగ్గుతోందని సిబ్బంది ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
కేవలం సెల్ ఫోన్ కారణంగా ఓటర్లు తిరిగి వెళ్లిపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నిమ్మగడ్డ తప్పు దిద్దుకున్నారు. ఓటర్లు గొడవకు దిగడంతో.. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఓటర్లు సెల్ ఫోన్లు తీసుకొచ్చినా పోలింగ్ కేంద్రంలోకి పంపించాలంటూ ఆదేశాలిచ్చారు. దీనికి సంబంధించి వెంటనే ఎన్నికల కమిషన్ పేరుతో ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.
గతంలో కూడా నిమ్మగడ్డ ఇలాంటి వివాదాస్పద ఆదేశాలు, నిర్ణయాలతో కోర్టుతో చీవాట్లు తిన్నారు. హడావిడిగా ఈ-వాచ్ యాప్ అనేది తీసుకొచ్చి దీనిపై సరైన వివరణ ఇవ్వలేకపోయారు. సెక్యూరిటీ పరంగా అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో హైకోర్టు ఆ యాప్ ని పక్కనపెట్టేసింది. ఇక వాలంటీర్ల సెల్ ఫోన్ల వినియోగంపై కూడా నానా రచ్చ చేశారు నిమ్మగడ్డ.
చివరకు ఆ సెల్ ఫోన్లు ఓ ప్రత్యేక అధికారి దగ్గర పెట్టి, అత్యవసరం అయితే వినియోగించేలా హైకోర్టు ఆదేశాలివ్వడంతో ఆ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పుడు ఓటర్ల సెల్ ఫోన్ల విషయంలో నిమ్మగడ్డ మరీ అత్యుత్యాహం ప్రదర్శించి అభాసుపాలయ్యారు. అంతలోనే సర్దుకున్నారు.