గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఓ విషయం బయటపెట్టాడు నితిన్. ఈ ఏడాది ఆల్రెడీ 3 సినిమాల్ని లైన్లో పెట్టిన ఈ హీరో, కుదిరితే నాలుగో సినిమాను కూడా థియేటర్లలోకి తీసుకొస్తానని అప్పుడే ప్రకటించాడు. అప్పట్లో నితిన్ సరదాగా ఆ మాట అన్నాడని అంతా సర్దిచెప్పుకున్నారు. కానీ ఈ హీరో మాత్రం కాస్త సీరియస్ గానే ఉన్నాడు. చెప్పినట్టుగానే నాలుగో సినిమాను కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయబోతున్నాడు.
ఈరోజు నితిన్ హీరోగా అంథూదున్ రీమేక్ ప్రారంభమైంది. సొంత బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నాడు నితిన్. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని కూడా ప్రకటించాడు. జూన్ నుంచి షూటింగ్ అంటే.. ఈ సినిమా ఇదే ఏడాది రావడం గ్యారెంటీ అన్నమాట. కుదిరితే నవంబర్, కుదరకపోతే డిసెంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనేది నితిన్ ప్లాన్.
నితిన్ నటించిన భీష్మ సినిమా ఆల్రెడీ థియేటర్లలోకి వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న రంగ్ దే సినిమాను జులైలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేస్తున్న సినిమాను సెప్టెంబర్ లో థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు అనుకున్న టైమ్ కు వస్తే, అంథూదున్ రీమేక్ నవంబర్ లో వస్తుంది. లేదంటే డిసెంబర్ లో రావడం గ్యారెంటీ.
ఇలా ఈ ఏడాది ఏకంగా 4 సినిమాలు ప్లాన్ చేశాడు నితిన్. మరోవైపు పెళ్లి కూడా చేసుకుంటున్నాడు. చూస్తుంటే.. పెళ్లి తర్వాత హనీమూన్, ఫ్యామిలీ ట్రిప్ అంటూ గ్యాప్ తీసుకునే ఆలోచనలో లేనట్టున్నాడు నితిన్.