ప్రతిపక్షంలో ఉన్నప్పడల్లా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆయన ఇటీవలే ప్రజ చైతన్య యాత్ర అంటూ ఒక యాత్రను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తమ పార్టీ ఇటీవలి ఎన్నికల్లో నెగ్గిన నియోజకవర్గాల్లో ఒకటైన చోట నుంచి అది మొదలైంది. తమ కులస్తుల జనభా ఎక్కువగా ఉండే చోటే వారిలో చైతన్యాన్ని కలిగించాలని చంద్రబాబు నాయుడు ఫిక్సయినట్టుగా ఉన్నారు. ఆ మేరకు ప్రారంభించారు. తొలి రోజే సీఎం జగన్ మీద ఇష్టానుసారం మాట్లాడారు చంద్రబాబు నాయుడు. ఇలాంటి మాటలే ఎన్నికల ప్రచారంలోనూ మాట్లాడారు. అప్పుడేమైందో తెలిసిన సంగతే. అయినా చంద్రబాబు తీరేమీ మారినట్టుగా కనిపించడం లేదు.
ఆ సంగతలా ఉంటే.. చంద్రబాబు యాత్ర అలా మొదలైందో లేదో వెంటనే విరామం తీసుకున్నారు. మొదట విరామం, ఆ వెంటనే వీకెండ్ రావడంతో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి శని, ఆదివారాల్లో కేరాఫ్ హైదరాబాద్ క్రమం తప్పడం లేనట్టుగా ఉంది. ఎక్కడో ఉండే ముంబై జనాలను అమరావతి రావాలని పిలుపునిచ్చిన చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవడంతో వారాంతాలు వస్తే హైదరాబాద్ కు చేరుతూ ఉండటం విడ్డూరమే.
ఇక సోమవారం నుంచి చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర మళ్లీ మొదలుకానున్నదని తెలుస్తోంది. 45 రోజుల పాటు ఈ యాత్ర జరుగుతుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు ప్రకటించాయి. మరి ఇలాంటి విరామాలతో కూడుకున్న 45 రోజులా అనేది తెలియాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ పూర్తి గందరగోళ పరిస్థితుల్లో ఉంది. ఐదేళ్ల అవినీతి వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెర మీదకు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ చైతన్య యాత్రలు పెట్టి ప్రభుత్వం మీద ఏదైనా మాట్లాడటం సంగతలా ఉంటే, తాము సమాధానాలు ఇచ్చుకోవాల్సిన అంశాలు చాలా తెరమీదకు వస్తున్నాయి. దీంతోనే చంద్రబాబు నాయుడు విచక్షాణారాహిత్యంతో మాట్లాడటానికి కూడా వెనుకాడటం లేదని, సీఎం జగన్ పై ఏకవచన ప్రయోగమే కాకుండా, తోచినట్టుగా మాట్లాడి చంద్రబాబు నాయుడు అక్కసు తీర్చుకుంటున్నారనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.