ఎర్ర పార్టీల నేతలకు ఎక్కువ, పచ్చ పార్టీ నేతలకు తక్కువ.. అన్నట్టుగా స్పందిస్తూ ఉన్నారు కమ్యూనిస్టు పార్టీ నేతలిద్దరు. వారే శ్రీమాన్ చికెన్ నారాయణ, మరొకరు రామకృష్ణ. వీళ్ల మాటలు ,వీళ్ల ప్రసంగాలు వింటే.. తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి దారి తప్పి వీరి వద్దకు వచ్చాయేమో అనిపించక మానదు. తెలుగుదేశం పార్టీ ఏ అంశం గురించి మాట్లాడితే.. వీళ్లు అదే అంశం గురించి మాట్లాడుతారు. తెలుగుదేశం నొప్పికి వీళ్లు విలవిలలాడుతూ వస్తున్నారు. అమరావతి తప్ప మరో అజెండా లేదని వీళ్లు మాట్లాడుతూ వస్తున్నారు.
తాజాగా ఈఎస్ఐ స్కామ్ ఒకటి వెలుగు చూసింది. ఈ అంశం గురించి ఈ కమ్యూనిస్టులు మాటెత్తితే ఒట్టు. ఈఎస్ఐ అంటే అది కార్మికుల సంబంధ వ్యవహారం. కార్మికుల గురించి మొదట మాట్లాడాల్సింది కమ్యూనిస్టులే. అయితే దానితో తమకు సంబంధం లేనట్టుగా వీరు వ్యవహరిస్తూ ఉన్నారు. అదే అమరావతి అంటే.. వీళ్లు అగ్గిమీద గుగ్గిలం అయిపోతారు! ఎగిరెగిరి మాట్లాడతారు!
చంద్రబాబుతో కలిసి జోలె పట్టిన వారిలో రామకృష్ణ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కడకు వెళితే అక్కడకు వెళ్లి ఈయన ఆ ముష్టి ఎత్తడం లో ముందున్నారు. కేవలం పచ్చ చొక్కా వేసుకోలేదనే మాటే కానీ, పచ్చ చొక్కా నేతలకు మించి చంద్రబాబు మీద భయభక్తులు కనబరిచారు ఈ ఎర్ర పార్టీ నేత.
ఇక చికెన్ నారాయణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే! ఈయనకు చికెన్ మీద ఎంత ప్రేమో, చంద్రబాబు మీద కూడా అంతే ప్రేమను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఈ నేతలిద్దరికీ రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఒక సలహా ఇచ్చారు. అదేమిటంటే.. వీళ్లిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరితే మేలని. బయట ఉంటి తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలకడం కంటే, ఆ పార్టీలోనే చేరితే ఇంకా గట్టిగా పని చేయవచ్చని శ్రీకాంత్ రెడ్డి సలహా ఇచ్చారు. వీళ్ల తీరు గమనించాకా బయటి జనాల్లో కూడా ఇదే ఫీలింగ్ ఉన్నట్టుంది. మరి ఎర్రచొక్కా విడిచి, పచ్చ చొక్కా వేసుకోవడం ఎంత సేపు?