ఇటీవలే నటుడు ప్రకాష్ రాజ్ ను చంపుతామంటూ కొందరు బహిరంగ హెచ్చరికలు చేశారు. కర్ణాటకలో నాస్తికవాదులకు, హిందుత్వ వ్యతిరేకులకు ఇలాంటి వార్నింగులు కొత్త కాదు. అక్కడ ఈ తరహా భావజాలంతో ఉన్న కొందరు ప్రముఖుల హత్యలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో అదే తరహాలో మాట్లాడుతూ ఉన్న ప్రకాష్ రాజ్ కు కూడా ఆ వర్గాల నుంచి హెచ్చరికలు వచ్చాయి. ప్రకాష్ రాజ్ కు డెత్ వార్నింగ్ జారీ చేశాయి. ఏదో తేదీ కూడా ప్రకటించి… ఆ రోజు లోపు ప్రకాష్ రాజ్ ను చంపుతామంటూ వారు హెచ్చరించారు కూడా. అయినా ప్రకాష్ రాజ్ తన పని తను చేసుకుపోతూ ఉన్నారు.
అయితే ఆయన భద్రతను తమ బాధ్యతగా తీసుకున్నట్టుగా ఉంది తెలంగాణ సర్కారు. ప్రకాష్ రాజ్ విషయంలో కర్ణాటక ప్రభుత్వం స్పందించలేదు. ఆయనతో పాటు పలువురు హిందుత్వ వ్యతిరేక వర్గాల వారికి హెచ్చరికలు వచ్చాయి. అయితే అలాంటి హెచ్చరికలను ఎదుర్కొంటున్న వారి విషయంలో ప్రభుత్వం స్పందించలేదు. వారి భద్రతకు పెద్దగా ఎలాంటి హామీ ఇచ్చినట్టుగా వార్తల్లో రాలేదు. అయితే ప్రకాష్ రాజ్ కు మాత్రం కేసీఆర్ సర్కారు భద్రతా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది.
ఈ విషయాన్ని ఆ నటుడే చెప్పాడు. తనకు వార్నింగులు వచ్చాకా కేసీఆర్ నుంచి ఫోన్ కూడా వచ్చిందని, పోలీసుల భద్రతను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారని ప్రకాష్ రాజ్ వివరించారు. తను వద్దు అని అన్నట్టుగా, అయితే కేసీఆర్ మాత్రం తప్పనిసరిగా సెక్యూరిటీని పెట్టుకోవాలని చెప్పారని, ఆయన చెప్పడంతో కాదనలేక పోలీసులను తనతో ఉంచుకుంటున్నట్టుగా ప్రకాష్ వివరించాడు. తన లా కాస్త పేరు ఉన్నవాడిని చంపడం అలాంటి వాళ్లకు కష్టమేమో అని, సామాన్యుల్లో ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే మాత్రం సులభంగా చంపేస్తున్నారని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. మూకదాడులు వంటి వాటిని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు.