అమరావతి ప్రాంత రైతులు, రాజధాని తమ ప్రాంతంలో మాత్రమే ఉండాలని కోరుతూ.. సుమారు రెండునెలలకు పైగా దీక్షలు చేస్తున్నారు. అదే సమయంలో హైకోర్టులో పిటిషన్ కూడా విచారణలో ఉంది. తదుపరి విచారణ ఈనెల 26న జరగనుంది. ఈ నేపథ్యంలో.. అమరావతి రైతులు కొత్త ఎత్తుగడకు వచ్చారు. న్యాయమూర్తులు హైకోర్టుకు వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా నిలబడి.. వారు వెళ్లే సమయంలో.. రెండు చేతులు ఎత్తి నమస్కారాలు పెడుతూ నిల్చుంటారు. మూడురోజుల పాటూ ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు ఇలా నిల్చుంటారు. న్యాయం చేయమని అర్థిస్తారుట. అయితే ఇక్కడ సందేహం ఏంటంటే.. న్యాయం అనేది నమస్కారాలతు వస్తుందా?
అధికార వికేంద్రీకరణ వివాదంగా మారిన తొలిరోజుల నుంచే హైకోర్టులో పిటిషన్ నడుస్తోంది. ఈ పిటిషన్ విచారణలో భాగంగా.. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు అమరావతి ప్రాంతంనుంచి కార్యాలయాలను తరలించడానికి వీల్లేదంటూ ఉత్తర్వులు కూడా వచ్చాయి. విజిలెన్స్ కార్యాలయాన్ని కర్నూలుకు తరలించడానికి జీవో రాగా.. కోర్టునుంచి అక్షింతలు కూడా వచ్చాయి. తమకు తెలియకుండా కార్యాలయాను తరలించడం లాంటి పనులు జరిగితే.. అధికారులు జీతాలనుంచి ఆ ఖర్చులు వసూలు చేస్తామని కూడా కోర్టు హెచ్చరించింది. దీంతో వ్యవహారం మొత్తం ఎక్కడిదక్కడే స్తబ్దుగా నిలిచిపోయింది.
తదుపరి విచారణ 26వ తేదీన ఉండేసరికి రైతులు తమ పోరాటానికి నాటకీయకోణాన్ని జోడిస్తున్నారు. న్యాయమూర్తులు కోర్టుకు వెళ్లే దారిలో ఇలా నిల్చుని నమస్కారాలు పెడతారన్నమాట. న్యాయపీఠం.. నమస్కారాలకు లొంగుతుందా? జాలినుంచి న్యాయం పుడుతుందా? కేవలం జాలి పడడం ద్వారా న్యాయపీఠం నుంచి సానుకూలత సాధించవచ్చుననుకుంటే.. నేరాలు చేసిన వారు.. మరిన్ని దయనీయమైన కథలు చెప్పి.. కన్నీళ్లు కార్చి నెగ్గగలరు.
అమరావతి రైతులకు న్యాయపోరాటం అనేది మంచి హక్కు, అస్త్రం. అమరావతి నుంచి రాజధానిని తరలించాలనుకోవడం ఏ రకంగా చట్టవిరుద్ధమో వారు కోర్టుకు నివేదించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తమకు మాట ఇచ్చి, ఒప్పందాలు చేసుకున్న తరువాత.. తర్వాతి ప్రభుత్వం తరలిస్తే అది ఏరకంగా ఒప్పంద అతిక్రమణ అవుతుందో వారు తెలియజెప్పగలగాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం వారు కోరుకునేదే కావచ్చు. కాకపోవచ్చు కూడా.