రాజకీయ మేధావుల తీరు వేరుగా ఉంటుంది. సాధారణంగా వారికి పుష్కలమైన మేధస్సు ఉంటుంది. కానీ.. అంతటి మేధస్సును కూడా ఒక రాజకీయ పార్టీ భావజాలానికి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారే తప్ప నిజాలు చెప్పరు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినంతవరకు యనమల రామకృష్ణుడు మేధావి కిందే లెక్క. కానీ ఆయన లాజిక్కుకు దొరకని అనేక విషయాలు మాట్లాడుతుంటారు. అలాంటిదే మరొకటి ఇప్పుడు వల్లిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అయిదేళ్ల అరాచక పాలన మీద దర్యాప్తు చేయించడానికి ప్రభుత్వం ఒక సిట్ ను నియమించింది. విధానాలు, ప్రాజెక్టు పనుల అప్పగింత వ్యవహారాల దగ్గరినుంచి.. సీఆర్డీయే ఇన్ సైడర్ ట్రేడింగ్ వరకు అన్ని విషయాలపై వచ్చిన ఆరోపణలు పుంఖానుపుంఖాలు. వాటిమీదనే ఈ సిట్ దర్యాప్తు చేస్తుంది. ఈ సిట్ వేసిన వెంటనే.. తెదేపా వర్గాలకంతా గుబులు పుట్టింది.
దాంతో.. ఒక రోజంతా అయిదేళ్ల పాలన మీద దర్యాప్తు చేయించడం అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు అంటూ.. యనమల రామకృష్ణుడు చాలా ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ఆయన మాత్రం.. తొమ్మిది నెలల జగన్ పాలన మీద దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. బహుశా ప్రపంచంలో.. ఒక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కేవలం తొమ్మిది నెలల్లోనే వారి పాలన మీద సీబీఐ విచారణ జరగడం అనేది.. యనమల రామకృష్ణుడు ఎన్ని దృష్టాంతాల్లో చూశాడో ఏమో ఆయనకే తెలియాలి.
మరో కామెడీ ఏంటంటే.. జగన్ మీద అవినీతి కేసుల విచారణ ముగింపు దశకు వస్తున్నందున.. ప్రజల దృష్టి మళ్లించడానికే జగన్ సిట్ ఏర్పాటుచేశారట. అదెలా సాధ్యం? లాజికల్ గా ఆలోచిస్తే.. ప్రజలదృష్టి మళ్లించినంత మాత్రాన జగన్ కేసుల విచారణ ఆగిపోతుందా? ప్రజల దృష్టి మళ్లించాల్సిన అగత్యం జగన్ కు ఏమిటి? ఎన్నికలు వచ్చేది ఇంకా నాలుగేళ్ల తర్వాత కదా? అని ప్రజలు ఆలోచిస్తున్నారు.
తొమ్మిది నెలల పాలనపై నిర్దిష్టంగా ఫలానా వ్యవహారంలో జగన్ సర్కారు అవినీతికి పాల్పడిందని ఇప్పటిదాకా తెదేపా ఆరోపణలు చేయలేకపోయింది. ఎంతసేపూ పాలన వైఫల్యాలు, పెట్టుబడులు వెనక్కు పోతున్నాయి.. అమరావతి తరలించొద్దు అనే నినాదాలే తప్ప… ఫలానా అవినీతి జరిగిందనగల సత్తా వారివద్ద లేదు. మరి వారికి ఏం విచారణ కావాలో.. ఏ విషయంలో సీబీఐ జోక్యం కోరుతున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు.