డబూ రత్నానీ క్యాలెండర్ కోసం నటి కియరా అద్వానీ ఇచ్చిన టాప్ లెస్ పోజు ఇప్పటికే రకరకాల కామెంట్లకు కారణం అయ్యింది. నెటిజన్లు ఒకవైపు ఆ ఫొటోను ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు దాన్ని ట్రోల్ కూడా చేశారు. కియరా ఇచ్చిన పోజును తీవ్రంగా విమర్శించారు. మీమ్స్ క్రియేట్ చేసి ఆడుకున్నారు. వాటిపై కియరా కూడా తేలికగా స్పందించింది. ఆ మీమ్స్ తనను కూడా నవ్వించాయని పేర్కొంది. తన పిక్ ను అవతార్ హీరోయిన్ లుక్ లోకి మార్చడాన్ని ఆమె సరదాగా తీసుకుంది.
ఆ సంగతలా ఉంటే.. ఈ ఆకుల క్రియేటివిటీ పై అంతర్జాతీయ స్థాయి విమర్శలు వచ్చాయి. ఇది కాపీ అని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పాటి ఆకులు అడ్డం పెట్టి ఫొటో తీయడాన్ని కూడా కాపీ కొట్టి ఉంటారా? అనే డౌట్ రావొచ్చు. అయితే ఇది వరకూ ఎవరో ఒక విదేశీ ప్రముఖ ఫొటో గ్రాఫర్, ఈ తరహాలో ఒక మోడల్ ఫొటో తీశారట. దాన్ని ఇప్పుడు డబూ కాపీ కొట్టాడనే ఆరోపణలు వస్తున్నాయి. అది మరో దుమారంగా మారింది.
అయితే తను కాపీ కొట్టలేదని డబూ వివరణ ఇచ్చుకున్నాడు. అందుకు ఆధారాలను కూడా చూపాడు. చాలా సంవత్సరాల కిందటే తను ఇలాంటి ఫొటో ఒకటి తీసినట్టుగా చెబుతున్నాడు. అప్పట్లో నటి టబును ఇదే తరహాలో ఆకులు అడ్డుపెట్టి క్యాప్చర్ చేసినట్టుగా పాత ఫొటోను ట్వీట్ చేశాడు. తనలో ఈ తరహా క్రియేటివిటీ చాలా కాలం కిందటి నుంచినే ఉందని, ఇప్పుడు దానికే కొంత మెరుగులు దిద్దినట్టుగా డబు చెబుతున్నాడు. కాపీ కొట్టడం జరిగితే అది తనను తాను కాపీ కొట్టడమే అని, వేరే వారి స్టిల్ ను తను కాపీ కొట్టలేదని వివరణ ఇచ్చుకుంటున్నాడు. మొత్తానికి కియరా టాప్ లెస్ స్టిల్ ఇంకా ట్రెండింగ్ లో ఉన్నట్టుంది!