ఏడాది మీద ఆరునెలలు అయింది బాహుబలి 2 విడుదలై. కనీసం మరో తొమ్మిది నెలలు పడుతుంది సాహో విడుదల కావడానికి. అంటే దాదాపు రెండేళ్లకు పైగా గ్యాప్. హీరో ప్రభాస్ సినిమాకు సినిమాకు మధ్య. అన్ని సినిమాలు బాహుబలి కావు. అన్ని సినిమాలకు మధ్య బాహుబలి అంత గ్యాప్ అవసరం లేదు. నిజానికి బాహుబలి లాంటి సినిమా అందించిన తరువాత ఒకటి రెండు అయినా నార్మల్ సినిమాలు టేకప్ చేసి వుండాల్సింది హీరో ప్రభాస్. ఇది మా మాట కాదు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.
సరే, మంచికో, చెడ్డకో సాహో లాంటి భారీ సినిమాను తలకెత్తుకున్నారు. కానీ ఫ్యాన్స్ విషయంలో ప్రభాస్ కావచ్చు, ప్రభాస్ పిఆర్ యూనిట్ కావచ్చు, వ్యవహరిస్తున్న తీరు కూడా సరికాదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాను, ముఖ్యంగా ట్విట్టర్ ను, అందులో కామెంట్స్, పోస్ట్ లను ఫాలో అవుతుంటే. ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతున్నవి రెండే విషయాలు కనిపిస్తుంటాయి. ఒకటి సాహో సినిమా అప్ డేట్స్. రెండు తమ తమ ఊళ్లలో ఫ్లెక్సీలు కట్టుకునేందుకు ప్రభాస్ లేటెస్ట్ స్టిల్స్.
కానీ ఈ రెండూ కనిపించవు ఎక్కడా? అప్ డేట్స్ విషయంలో సాహో నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ స్టయిల్ వేరు. ఆ సంస్థ సినిమా విడుదల టైమ్ లో తప్ప, మిగిలిన టైమ్ లో ప్రచారానికి దూరంగా వుంటుంది. అది పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా.
ఇక స్టిల్స్ అంటారా? అసలు ప్రభాస్ ను బయటచూసి ఎన్నాళ్లయింది. ఇన్ సైడ్ ప్రభాస్ ఫుల్ చాలా క్యాజువల్ గా రఫ్ లుక్ తో, షార్ట్స్ తో వుంటాడు ఎక్కువగా. మరి ఆ స్టిల్స్ ఎక్కడ పనికి వస్తాయి? అసలు ప్రభాస్ కు జనరల్ ఫొటో షూట్ అనేదే జరగలేదు. ఇంక ఫ్యాన్స్ కు స్టిల్స్ ఎలా ఇస్తారు? ఇదీ పీఆర్ టీమ్ సమస్య.
సాహొ సినిమా విడుదలకు ఇంకా బోలెడు టైమ్ వుంది. ఇప్పటి నుంచి అందులో లుక్ లు రివీల్ చేయడం అనవసరం ఇది మేకింగ్ యూనిట్ ఆలోచన. ఇలా దానా దీనా అన్నీకలిసి ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశనే మిగులుస్తున్నాయి.
సినిమా విడుదలకు రెండునెలల ముందు ప్రచారం మొదలుపెడితే అన్నీ సద్దుకుంటాయి. రావాల్సిన బజ్ అదే వస్తుంది. అందుకే ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నా, ప్రభాస్, ఆయన టీమ్ అంతా సైలంట్ గా వుండిపోయింది. మరి రైట్ నో? రాంగ్ నో? వాళ్లకే తెలియాలి.