ఉత్తరాంధ్ర అంటే సినిమా జనాలకు వైజాగ్ అనే గుర్తు. వైజాగ్ ఏరియా హక్కులు అంటే ఉత్తరాంధ్ర మూడు జిల్లాల హక్కులు అన్నమాట. ఒకప్పుడు ఆ మూడు జిల్లాల మీద టాలీవుడ్ దృష్టి పెద్దగా వుండేదికాదు. అందువల్ల ఈ మూడుజిల్లాలు గంపగుత్తగానే హక్కులు విక్రయించేవారు. అదే ఇప్పటికీ అలవాటుగా మారింది.
అయితే రాను రాను ఉత్తరాంధ్ర హక్కుల రేట్లు భయంకరంగా పెరిగాయి. దీనికి కారణం ఆ మూడు జిల్లాల్లో థియేటర్ల మోడరైజేషన్, అలాగే మల్టీ ఫ్లెక్స్ లు వగైరా పెరగడం. అదే విధంగా కోర్టులకు వెళ్లి తొలివారంలో టికెట్ ల రేట్లు పెంచేయడం. ఇలా ఉత్తరాంధ్ర నుంచి మంచి ఆదాయం పొందుతోంది టాలీవుడ్. సినిమా విడుదలకు ముందు విశాఖలో మీటింగ్ లు పెట్టడం, విశాఖ అంటే ప్రేమ కురిపించడం హీరోలకు అలవాటు.
అలాంటి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు కష్టం వస్తే, ఎందరు హీరోలు స్పందించారు? ఎందరు నిర్మాతలు స్పందించారు? ఎందరు దర్శకులు స్పందించారు? శ్రీకాకుళం జనాలు ఇప్పుడు గమనించాలి. మేల్కొవాలి. తమ మీద తము పూజించే హీరోలకు ఎంత ప్రేమ వుందో క్లియర్ గా అర్ధం చేసుకోవాలి.
ముఖ్యమంత్రి, అధికార యంత్రాంగం శ్రీకాకుళంలో వుండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తుంటే, కేవలం నలుగురయిదుగురు సినిమా జనాలకు తప్ప మిగిలిన వారికి అస్సలు శ్రీకాకుళం తుపాను బాధితుల సంగతే పట్టలేదు. ఓ చిన్న నటుడు సంపూర్ణేష్ బాబు స్పందించారు అందరికన్నా ముందుగా. అంతవరకు ఏ టాప్ హీరో కూడా స్పందించలేదు.
ఈ టాప్ హీరోలంతా విశాఖ హక్కులు అంటూ తమ సినిమాకు పదికోట్ల వరకు ఇక్కడి సినిమా అభిమానుల జేబుల్లోంచి టికెట్ రూపంలో పట్టుకుపోతున్నారు. సినిమా రంగంలోకి ఘట్టమనేని కుటుంబం వుంది. మహేష్ బాబు అనే సూపర్ స్టార్ వున్నారు. ఒక్క రూపాయి సహాయం ప్రకటించలేదు. కనీసం ట్విట్టర్ లో అయ్యో అనలేదు. ఉత్తరాంధ్ర మహేష్ అభిమానులు గమనించేవుంటారు.
అక్కినేని ఫ్యామిలీ వుంది. ముగ్గురు, నలుగురు హీరోలు వున్నారు. ఒక్కరూపాయి సాయం ప్రకటిస్తే ఒట్టు. కనీసం నాగ్ ట్విట్టర్ లో స్పందించడం అన్నదే లేదు. అసలు వారికి శ్రీకాకుళం జిల్లా, తుపాను అన్నదే తెలియదేమో?
మంచు ఫ్యామిలీ నుంచి మనోజ్ పర్సనల్ కిట్ లు పంపారని హీరో నిఖిల్ ట్వీట్ చేయడం ద్వారా తెలిసింది. మనోజ్ మాత్రం ట్విట్టర్ తన స్పందన తెలిపారు. నందమూరి ఫ్యామిలీ నుంచి, అల్లు ఫ్యామిలీ నుంచి, వరుణ్ తేజ, నిఖిల్, విజయ్ దేవరకొండ వంటి వారు డొనేషన్లు ఇవ్వడమో, సాయం అదించడంమో జరిగింది. రామ్ చరణ్ ఓ గ్రామం దత్తత తీసుకుంటా అన్నారు. అది తరువాత. ముందు వెళ్లి సాయం అందివ్వాలి కదా?
మెగాస్టార్, పెద్దదిక్కు అంటూ టాలీవుడ్ కీర్తించే టాప్ హీరో చిరంజీవి. రాజకీయ పార్టీ పెట్టారు. కేంద్రమంత్రిగా వున్నారు. తనవంతు సాయం అందించాలనే ఆలోచన లేదా? అంత పెద్దాయనకు?
సాయిధరమ్ తేజ్ నుంచి మాటా పలుకులేదు.
ఇక దగ్గుబాటి ఫ్యామిలీ. విశాఖలో సురేష్ బాబుకు వ్యాపారాలు వున్నాయి. స్టూడియో వుంది. రూపాయి సాయం విదల్చలేదు. రానా మాత్రం 750 కిట్స్ పంపారని అంటున్నారు. ఇక బాహుబలి హీరో ప్రభాస్ సంగతి చెప్పనక్కరే లేదు. ఓ సాయం లేదూ. ఓ స్పందనా లేదు. జనసేన అధిపతిగా ట్విట్టర్ లో ట్వీట్లతో ప్రభుత్వంపై హోరెత్తిస్తున్న పవన్ కళ్యాణ్ తనవంతు సాయం ప్రకటించిన వైనం వినిపించడం లేదు. కనిపించడం లేదు.
నిజానికి ఇదేనా స్పందన? ఇదేనా సాయం? వీళ్ల సినిమా ఫంక్షన్లకు అయితే విశాఖ కావాలి. విశాఖ బీచ్ లో మీటింగ్ లు పెట్టి ఐ లవ్ యు విశాఖ అంటూ కబుర్లు చెప్పాలి. కానీ అదే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళానికి కష్టం వస్తే? మాత్రం కదలరు. సాయం అందించరు.
ఎక్కడో కేరళకు సాయం కావాలంటే మాత్రం లగెత్తుతారు. శ్రీకాకుళం సినిమా అభిమానులు ఈ వైనం గమనించాలి. సినిమా హీరోల మీద పిచ్చి అభిమానం తగ్గించుకుని, తమ జేబులు గుల్ల చేసుకుని, అధిక థరలకు టికెట్ లు కొనడం, ఫ్లెక్సీలు కట్టడం వంటివి చేసే ముందు ఈ వైనం గుర్తుంచుకోవాలి.
శ్రీకాకుళం జనాలు సరైన రీతిలో సిన్మా జనాల మీద స్పందిస్తే, ఇలాంటి ఉదాసీన వైఖరి మరోసారి కనిపించదు.