ఈ ప్రపంచంలో కరోనా లేని దేశం ఏదీ లేదు. ప్రతి దేశంలో పాజిటివ్ కేసులున్నాయి. అయితే కరోనా ఫ్రీ ప్రాంతాలు మాత్రం కొన్ని ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో ఒకటి ఎవరెస్ట్ శిఖరం. ఇన్నాళ్లు కరోనాకు దూరంగా ఉన్న ఈ శిఖరంపైకి కూడా ఇప్పుడు కొవిడ్-19 చేరిపోయింది.
కరోనా కారణంగా దాదాపు ఏడాది పాటు ఎవరెస్ట్ వద్ద పర్వతారోహణను నిలిపేశారు. అలా సుదీర్ఘ విరామం తర్వాత ఈ మధ్యే పర్వాతారోహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నేపాల్ ప్రభుత్వం. కొన్ని వారాల కిందట మాత్రమే తెరిచింది. అయితే పర్వతం ఎక్కడానికి 72 గంటల ముందు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ చూపించాలి. అలాంటి వ్యక్తుల్ని మాత్రమే ఎవరెస్ట్ పర్వతారోహణకు అనుమతిస్తారు.
ఇన్ని జాగ్రత్తలు తీసుకొని పర్వతం ఎక్కినప్పటికీ, మార్గమధ్యంలో ఓ పర్వతారోహకుడికి కరోనా సోకడం సంచలనంగా మారింది. నార్వేకు చెందిన ఎర్లెండ్ నెస్, ఎవరెస్ట్ పై కరోనా సోకిన మొదటి విదేశీ వ్యక్తిగా గుర్తింపు పొందాడు.
పర్వతారోహణలో భాగంగా ఖంబు లోయకు చేరినప్పుడు ఓ చిన్న టీ కొట్టు దగ్గర ఆగాడు నెస్. అక్కడ టీ కూడా తాగాడు. ఆ తర్వాత ఎవరెస్ట్ కు వెళ్లిన మార్గమధ్యంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడ్ని హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్ లో ఖాట్మాండు తీసుకొచ్చి పరీక్షించగా పాజిటివ్ నిర్థారణైంది.
బహుశా ఆ లోయలో టీ తాగడమే తను చేసిన తప్పేమో అంటాడు నెస్. ఏదైతేనేం. ఎవరెస్ట్ శిఖరం ఎక్కే క్రమంలో పర్వతంపై కరోనా సోకిన మొదటి విదేశీయుడిగా నెస్ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నాడు.