సుమిత్ర మహాజన్ …సాధారణ లీడర్ కాదు. 2014-19 మధ్య కాలంలో లోక్‌సభ స్పీకర్‌గా సేవలందించిన మహిళా నేత. బీజేపీలో అత్యంత సీనియర్. అయితే ఎలా జరిగిందో తెలియదు కానీ, ఆమెకు సంబంధించి ఓ అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది.
సుమిత్రా మహాజన్ చనిపోయారనే వార్త దావానలంలా వ్యాపించింది. దీనికి తోడు పలువురు ఆమె మృతికి నివాళులర్పిస్తూ ట్వీట్లు చేశారు. అయితే తాను బతికే ఉన్నా మహాప్రభూ అంటూ ఆమె దేశానికి సోషల్ మీడియా వేదికగా ప్రకటించుకోవాల్సి వచ్చింది. దీంతో ఆమె మృతిపై ట్వీట్లు చేసిన వారంతా వాటిని తొలగించాల్సి వచ్చింది.
సుమిత్రా మహాజన్ మృతి చెందారని గురువారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఈ విషయం తెలిసి బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై సుమిత్రా మహాజన్ కుటుంబ సభ్యులకు నేతలు ఫోన్ చేసి ఆరా తీయగా అబద్ధమని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు మందార్ ట్విటర్ నుంచి తాను మాట్లాడిన ఓ ఆడియాను క్లిప్‌ను విడుదల చేశారు. అందులో ఏమున్నదంటే…
‘నేను మరణించాననే వార్త దేశమంతా వ్యాపించింది. ఈ విషయం తెలిసి ముంబైలోని నా బంధువులు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. ఈ తప్పుడు వార్త ఎవరు చెప్పారంటూ ట్విటర్లో శశి థరూర్‌ని నా తమ్ముడి కూతురు నిలదీసింది. ముంబైలోని కొన్ని న్యూస్ చానెళ్లు సైతం ఎందుకు తప్పుడు వార్తలు ఫ్లాష్ చేశాయో అర్థం కావడం లేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ … ‘ఆమె ఆరోగ్యంగా ఉన్నారంటే నాకు అంతకు మించిన ఆనందం మరొకటి లేదు. విశ్వసించ దగ్గ వ్యక్తుల నుంచి నాకు సమాచారం రావడంతో నిజమేనని నమ్మాను. సుమిత్రా మహాజన్ కుమారుడితో మాట్లాడాను. తప్పుడు ప్రచారం గురించి క్షమాపణ కోరా’ అని ఆయన వేర్వేరు ట్వీట్లలో పేర్కొన్నారు.
‘ఎలాంటి ధ్రువీకరణ లేకుండా వీళ్లంతా ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తే నేనేం చేసేది? ఇలా వార్తలు చెప్పేముందు కనీసం ఇండోర్ జిల్లా అధికారులనైనా కనుక్కుని ఉండాల్సింది. కేంద్ర ప్రభుత్వం, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని కోరుతున్నా’ అని సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. ఏది ఏమైనా సుమిత్రా మహాజన్ బతికి ఉండగానే …కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం బాధాకరం.