పీఎంతో స‌మావేశంలో సీఎం భావోద్వేగం

క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతిపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న నెల‌కుంది. క‌రోనా బారిన ప‌డ్డ వారికి అక్సిజ‌న్ అంద‌క పిట్ట‌ల్లా రాలుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కొన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ఉన్న‌త స్థాయి…

క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతిపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న నెల‌కుంది. క‌రోనా బారిన ప‌డ్డ వారికి అక్సిజ‌న్ అంద‌క పిట్ట‌ల్లా రాలుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కొన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ఉన్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ స‌మావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నీతీ ఆయోగ్ హెల్త్ మెంబర్ వీకే పాల్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, హర్షవర్ధన్, ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాకరే, అశోక్ గెహ్లాట్, బీఎస్ యడియూరప్ప, పినరయి విజయన్, శివరాజ్ సింగ్ చౌహాన్, విజయ్ రూపానీ, భూపేష్ బాఘేల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ పాల్గొన్నారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన ప్ర‌సంగం యావ‌త్ దేశాన్ని క‌దిలింప‌జేసింది. క‌రోనా అత్యంత ద‌య‌నీయ స్థితిని ఆయ‌న మాట‌లు ప్ర‌తిబింబించాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంద‌ని, ఆక్సిజ‌న్ కొర‌త తీవ్రంగా వేధిస్తోంద‌న్నారు. ఆక్సిజ‌న్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేక‌పోతే, ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే మ‌హా విషాదం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. ఢిల్లీని కాపాడాల‌ని ఆయ‌న వేడుకున్నారు.

ఢిల్లీలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు లేవని, అందువల్ల తమకు ఆక్సిజన్ ఇవ్వరా? అని ప్ర‌ధానిని నిల‌దీశారు. ఒక వైపు ఆస్పత్రుల్లో ఆక్సిజ‌న్ కొర‌త‌, మ‌రో వైపు రోగులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నార‌ని, ఈ ప‌రిస్థితుల్లో తాను ఎవ‌రితో మాట్లాడాలో చెప్పాల‌ని స‌మావేశంలో కేంద్రాన్ని నిల‌దీశారు. తాను ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టికీ ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో ఉన్నాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. .

క‌రోనా బారిన ప‌డ్డ‌వారికి వైద్యం అంద‌క ఆర్త‌నాధాలు చేస్తుంటే, మ‌రోవైపు ప్రాణాలు కోల్పోతున్న ద‌య‌నీయ స్థితిలో రాత్రంతా త‌న‌కు నిద్రపట్టడం లేదని వాపోయారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా తనను క్షమించాలని కేజ్రీవాల్ కోర‌డం గ‌మ‌నార్హం. 

ఆక్సిజన్ ప్లాంట్లను సైన్యం స్వాధీనం చేసుకోవాలన్నారు. మొత్తానికి ఉన్న‌త‌స్థాయి స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ప్ర‌సంగం దేశాన్ని భావోద్వేగానికి గురి చేసింది. మ‌రి కేంద్రాన్ని ఏ మేర‌కు చ‌లింప‌జేస్తుందో కాల‌మే జ‌వాబు చెప్పాలి.