వివిధ అక్రమాలకు సంబంధించి టీడీపీ నేతల అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (శుక్రవారం) తెల్లవారు జామున టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. సంగం డెయిరీలో అవకతవకలకు సంబంధించి ఆ పరిశ్రమ చైర్మన్ నరేంద్రపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఇందులో భాగంగా నరేంద్రపై చర్యలకు ఏసీబీ ఉపక్రమించింది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలోని ధూళి పాళ్ల నరేంద్ర ఇంటికి వంద మందికి పైగా పోలీసులు వెళ్లారు.
ఒక్కసారిగా అంత మంది పోలీసులు వెళ్లడంతో గ్రామస్తులు ఉలిక్కి పడ్డారు. సీఆర్పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నరేంద్రపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు నోటీసులో పేర్కొన్నారు.
అనంతరం నరేంద్రను అరెస్ట్ చేశారు. నరేంద్ర అరెస్ట్‌తో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్ట్‌ను నరేంద్ర అరెస్ట్ తలపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అచ్చెన్న ఇంటిని కూడా వందలాది మంది పోలీసులు తెల్లవారుజామున చుట్టుముట్టి అరెస్ట్ చేసి విజయవాడకు తరలించిన సంగతి తెలిసిందే.
నరేంద్ర అరెస్ట్‌పై టీడీపీ అగ్రనేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం కాదని, తాము అధికారంలోకి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని టీడీపీ నేతలు హెచ్చరించడం గమనార్హం.