సంగం డెయిరీలో అవకతవకలపై ఆ పరిశ్రమ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయడంపై టీడీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. జగన్ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే ఒక్కో టీడీపీ నేతను అరెస్ట్ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
నరేంద్ర అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ ఓ రహస్యాన్ని చెప్పుకొచ్చారు. సంగం డెయిరీని దెబ్బతీసి అమూల్‌కు కట్టబెట్టే కుట్రలో భాగంగానే ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేశారనేదే చంద్రబాబు ప్రధాన ఆరోపణ.
స్థానిక రైతులు భాగస్వామిగా ఉండే సంగం డెయిరీని నిర్వీర్యం చేసి గుజరాత్‌కు చెందిన అమూల్‌కు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే అక్రమ కేసు పెట్టారని విమర్శించారు. పొరుగు రాష్ట్రానికి చెందిన అమూల్‌తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని ఇక్కడి సంస్థలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండేళ్ల పాలనలో అభివృద్ధి లేదు కానీ.. అక్రమ అరెస్ట్‌లు మాత్రం ఉంటున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు తదితర నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా నియంత్రణలో విఫలమవడంతో ప్రజలను పక్కదారి పట్టించడానికే టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. ఇలా ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అక్రమ అరెస్ట్‌లు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో ఎవరూ మిగలరని జగన్ రెడ్డి గుర్తించాలని చంద్రబాబు హితవు పలికారు.
ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ వెనుక రెండు ప్రధాన రహస్యాలను చంద్రబాబు వెల్లడించినట్టు గుర్తించాలి. ఒకటేమో ఏపీ పరిశ్రమలను దెబ్బ తీసి ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజతార్‌కు చెందిన అమూల్‌ను బలపరచడం, రెండోది కరోనా సెకండ్ వేవ్‌ను అరికట్టడంలో జగన్ సర్కార్ విఫలం కావడం.
ఈ రెండు కారణాలే తప్ప, సంగం డెయిరీలో అక్రమాలు నరేంద్ర అరెస్ట్‌కు ఎంత మాత్రం కాదనేది చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల వాదన. నరేంద్రను అరెస్ట్ చేశారు సరే, ఆయనపై అవినీతి ఆరోపణలను నిరూపించేందుకు ఏసీబీ అధికారులు ఎలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది.