గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గి, తెలుగుదేశం చేతిలో అధికారం ఉన్నప్పుడు అటు వైపు వెళ్లిపోయిన పలువురు నేతలు ఎన్నికలు అయిపోగానే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరే ప్రయత్నాలు చేశారనే వార్తలు ఇది వరకే వచ్చాయి. లోక్ సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున చిత్తు అయిన పలువురు నేతలు వైఎస్ జగన్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేశారనే వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికలు కాగానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవకాశం దక్కుతుందా అనే ప్రయత్నం చేసిన వారి పట్ల జగన్ అంత సానుకూలంగా స్పందించలేదనే వార్తలు వినిపించాయి.
ఇక ఎన్నికలు అయిపోవచ్చి ఏడాదికి సమయం దగ్గర పడుతూ ఉంది. ఏపీలో పోలింగ్ పూర్తి అయ్యి ఇప్పటికే పది నెలలు గడిచిపోయాయి. ఏడాది దగ్గర పడుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో సదరు నేతల ప్రయత్నాలు మళ్లీ ముమ్మరం అయ్యాయనే వార్తలు వస్తూ ఉండటం గమనార్హం. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిపించుకోవడానికి ప్రయత్నాలను సాగిస్తున్నట్టుగా సమాచారం. జగన్ అవకాశం ఇస్తే వీళ్లు ఎప్పుడో ఇటు వైపు చేరిపోయే వారే. అయితే వారి విషయంలో జగన్ ఆచితూచి స్పందిస్తూ ఉన్నారు. అవసరమైనప్పుడు రామ్మనవచ్చు అనే అభిప్రాయాలతో ఉన్నారో ఏమో కానీ, వారు పంపుతున్న ప్రతిపాదన పట్ల జగన్ నింపాదిగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఆ నేతలు మాత్రం తమ ప్రయత్నాలను ఆపడం లేదని తెలుస్తోంది. అప్పుడేవో ఒత్తిళ్లకు తట్టుకోలేక వెళ్లిపోయినట్టుగా, ఇప్పుడు తమ మీద దయ చూపాలన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారట. పార్టీలోకి బేషరతుగానే చేరుతామంటూ వారు ప్రతిపాదనలు పంపుతున్నట్టుగా సమాచారం. ఈ ప్రతిపాదనలు మళ్లీ జగన్ వద్దకు వెళ్లాయని తెలుస్తోంది. వాటికి ఆయన ఎలా స్పందిస్తారో త్వరలో జరిగే చేరికలను బట్టి తెలుస్తుందని సమాచారం.
ఇప్పుడు ప్రతిపాదనలను పంపిన వారిలో గతంలో తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి పోయి జగన్ ను విమర్శించిన వాళ్లు, ఇటీవల కూడా సీఎంహోదాలోని ఆయనను విమర్శించిన వాళ్లున్నారు. అయితే వీరంతా ఈ మధ్యకాలంలో మాత్రం విమర్శల జోలికి వెళ్లడం లేదు. మరీ తెలుగుదేశం ఆఫీసు నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తూ ఉన్నారని తెలుస్తోంది. మరీ వీరి కోసం జగన్ ఎప్పుడు గేట్లు తెరుస్తారో!