అదేంటో తమ్ముళ్ళ తలరాతలు బాగోలేదేమో. వరసగా ఒకరి తరువాత ఒకరు అడ్డంగా దొరికేస్తున్నారు. ఉత్తరాంధ్రాలో అసలే కొన ఊపిరితో ఉన్న టీడీపీలో ఇపుడు బిగ్ షాట్ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణంలో చిక్కుకున్నారు. అది లాక్కోలేక పీక్కోలేక అల్లాడుతూంటే మరో ఎమ్మెల్యే తమ్ముడి నిర్వాకం పసుపు శిబిరంలో కలవరం రేపుతున్నాయి.
విశాఖ అర్బన్ టీడీపీ ప్రెసిడెంట్, సౌత్ ఎమ్మెల్యే అయిన వాసుపల్లి గణేష్ కుమార్ కి చెందిన వైజాగ్ డిఫెన్స్ అకాడమీ ఇపుడు వివాదంగా నిలిచింది. అక్కడ శిక్షణార్ధులుగా చేరిన వారి నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ సరైన వసతులు కల్పించడం లేదన్న ఫిర్యాదుతో అటు మీడియా, ఇటు పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా కదిలాయి.
వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో ప్లే గ్రౌండ్, హార్స్రైడింగ్, సరైన భోజన వసతులు లేవని నిర్వాహకుల్ని విద్యార్థులు ప్రశ్నించారు. ఈ ఆందోళన నేపథ్యంలో 100 మంది విద్యార్థులను నిర్వాహకులు సెల్లార్లోనే బంధించారు. విషయం తెలుకున్న ఢిపెన్స్ అకాడమీకి చేరుకున్న పోలీసులు సంఘటనపై విచారణ చేపట్టారు.
ఇలా విద్యార్థులను చిత్రహింసలకు గురిచేస్తున్నారని డిఫెన్స్ అకాడమీపై పలు ఆరోపణలు రావడంతో ఇపుడు టీడీపీలో మరో ఎమ్మెల్యే తమ్ముడు ఇరకాటంలో పడ్డారు. దీని మీద ఆ పార్టీ పెద్దాయన, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాత్రం ఇది బీసీల మీద దాడిగా చిత్రీకరిస్తున్నారు.
కళ్ళ ముందు పెద్ద ఎత్తున విద్యార్ధులు మీడియాతో లైఫ్ లో మాట్లాడుతూ మాకు నిర్వాహకులు సదుపాయాలు లేకుండా చేశారని, హింస పెడుతున్నారని చెబుతున్నా కూడా ఇది వైసీపీ సర్కార్ కుట్ర అని అనడం ఆ మాజీ మంత్రిగారికే చెల్లిందని వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్లేస్తున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్రా టీడీపీలో వరసగా తమ్ముళ్ళకు తగులుతున్న దెబ్బలతో పచ్చ శిబిరంలో కొత్త చిచ్చు రేగుతోంది.