సౌత్ ఇండియా అబ్బాయి మహేశ్‌బాబు, నార్త్ ఇండియా అమ్మాయి నమ్రత. రెండు విజాతి ధ్రువాలు పరస్పరం ఆకర్షించుకున్నాయి. పెళ్లితో శాశ్వత బంధాన్ని ఏర్పరచుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇరు వైపులా కుటుంబ పెద్దల నుంచి చిన్నపాటి అడ్డంకులు. అయితేనేం, సంకల్పం బలంగా ఉన్నప్పుడు…అడ్డంకులు ఏమీ చేయలేవని వాళ్లిద్దరూ నిరూపించారు. వాళ్లిద్దరికి వివాహమై 15 ఏళ్లు. తమ దాంపత్య జీవిత మధురానుభూతుల గురించి వారు ‘సాక్షి’తో పంచుకున్నారు. మహేశ్‌బాబులో నమ్రతకు, ఆమెలో తనకు నచ్చే అంశాలేవో మహేశ్‌బాబు ఓపెన్‌గా మనసులో బయట పెట్టారు.
తామిద్దరూ కలసి కేవలం ఒకే ఒక్క సినిమా వంశీ చేశామని మహేశ్‌బాబు, నమ్రత చెప్పారు. ‘వంశీ’ సినిమా కోసం 52 రోజులు అవుట్డోర్ షూటింగ్ చేశామని, ఆ షెడ్యూల్ పూర్తయి ఒకరిని ఒకరం దూరం అవుతామనే ఆలోచనే భరించలేనిదిగా అనిపించిందని నమ్రత చెప్పారు. ఆ ఫీలింగ్ నుంచే పెళ్లి ఆలోచన వచ్చిందని, అది కాకుండా మహేశ్ ప్రవర్తన చూసి జీవితాన్ని పంచుకోవడానికి తనే పర్ఫెక్ట్ అనిపించిందని నాటి తీపి జ్ఞాపకాలను ఆమె నెమరు వేసుకున్నారు.
‘వంశీ’ సినిమా కోసం పనిచేసిన ఆ కొన్ని రోజుల్లో నమ్రత బెస్ట్ బెటరాఫ్ అవుతుందని తనకూ అనిపించిందని మహేశ్ చెప్పుకొచ్చారు.
మహేశ్‌కు పర్ఫెక్ట్ భార్యని అవుతానని వాళ్ల ఫ్యామిలీని కన్విన్స్ చేసేందుకు నాలుగేళ్లు పట్టినట్టు నమ్రత చెప్పారు. ఆ నాలుగేళ్లు తాను ఓపికగా వెయిట్ చేశానని, చేసుకుంటే మహేశ్నే లేకపోతే లేదు అని ఫిక్స్ అయ్యానని ఆమె తెలిపారు.
మా దాంపత్య జీవితంలో గౌతమ్ పుట్టడం ఓ మంచి అనుభూతి అని ఆమె చెప్పారు. అలాగే సితార పుట్టడం ఇంకో మంచి అనుభూతి అని అన్నారు. యాక్టర్ నుంచి సూపర్ స్టార్‌గా మహేశ్ మారడం.. ఇవన్నీ తనకు చాలా చాలా స్పెషల్ మూమెంట్స్ అని నమ్రత వివరించారు.
నమ్రత సింప్లిసిటీ అంటే తనకు చాలా ఇష్టమని మహేశ్ చెప్పారు. ఏ సందర్భంలో అయినా తను తనలానే ఉంటుందని, ముఖ్యంగా తనలో నెగటివ్ ఆలోచనలు ఉండవన్నారు. అలాగే అవసరమైనప్పుడు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందన్నారు. అంతేకాదు నమ్రత చాలా నిజాయితీ గల మనిషి అని తన భార్య గురించి గొప్పగా చెప్పారాయన.
మహేశ్‌లో అమాయకత్వం ఉందని, అలాగని అమాయకుడు కాదని నమ్రత చెప్పారు. మహేశ్ సున్నిత మనస్కుడని, ఫ్యామిలీని తను ప్రేమించే విధానం సూపర్బ్ అని పొగడ్తలతో ముంచెత్తారామె.
పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలన్నది తన సొంత నిర్ణయమేనని నమ్రత చెప్పారు. ఆ నిర్ణయం సరైంది కాదని ఒక్క నిమిషం కూడా అనిపించలేదన్నారు. ‘మహేశ్ నాకు మంచి జీవితాన్నిచ్చారు. ఇంతకు మించి నాకేం కావాలి? మహేశ్, పిల్లలు నా ప్రపంచం. వీళ్లు కాకుండా నాకు వేరే ఏ ఆనందాలూ అక్కర్లేదు. ఆ మాటకొస్తే ఈ జీవితం కాకుండా నాకు వేరే జీవితం కూడా అవసరం లేదు’ అని ఆమె ఎంతో ఎమోషనల్‌గా చెప్పారు.
మదర్‌గా నమ్రత అమేజింగ్… వంక పెట్టే పనిలేదు అని మహేశ్ చెప్పారు. ఎన్ని మార్కులు ఉంటే అన్ని మార్కులూ తనకి ఇచ్చేయొచ్చు అని మహేశ్ తెలిపారు. తను స్ట్రిక్ట్ మదర్ అని, ఇక భార్యగా నమ్రత గురించి చెప్పాలంటే.. చాలా చాలా గొప్ప భార్య అని కితాబిచ్చారు.
‘నమ్రత లేకపోతే నేను లేను. నా బెస్ట్ ఫ్రెండ్, నా సపోర్ట్ సిస్టమ్ అన్నీ తనే. నా జీవితాన్ని చాలా సులువుగా మార్చడం తనకి మాత్రమే తెలుసు’ అని మహేశ్ ముగించారు.