మొన్నటికి మొన్న ఓ గ్యాసిప్ గుప్పుమంది. చిరు 152 సినిమా ఆచార్యలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తారని. కానీ ఈ వార్త నిజమా? కామెడీనా? అని ఇండస్ట్రీలో గుసగుసలు బయల్దేరాయి. ఎందుకంటే చిరు పాత్ర యంగర్ వెర్షన్ లో చరణ్ కనిపించాల్సి వుంది. ఆర్ఆర్ఆర్ కారణంగా, రామ్ చరణ్ నటిస్తే, ఆ సినిమా 2021 సమ్మర్ కు వెళ్లిపోతుంది. అలా వెళ్లకుండా వుండాలంటే చరణ్ నటించకుండా వుండాలి. అలా చరణ్ కాకుంటే మరెవరు?
అప్పుడే కొన్ని మాధ్యమాల్లో మహేష్ బాబు పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు ఇదే నిజం చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేవలం 25 రోజలు కాల్ షీట్లు ఇవ్వడానికి, అందుకు మహేష్ కు భారీ రెమ్యూనిరేషన్ ఇవ్వడానికి టాక్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇమ్మీడియట్ గా చేతిలో సినిమా లేదు. తరువాత సినిమా కు ఇంకా టైమ్ వుంది కనుక, మహేష్ ఒప్పుకునే మూడ్ లోనే వున్నట్లు తెలుస్తోంది.
మహేష్ ను ఒప్పించడానికి భారీ రెమ్యూనిరేషన్ ను ఆఫర్ చేసినట్లు బోగట్టా. కొరటాల శివ, చిరు, మహేష్ రెమ్యూనిరేషన్లు ఎంత భారీగా వేసుకున్నా 75 కోట్ల మేరకు వుంటాయి. మేకింగ్ కు మరో యాభై వేసుకున్నా 125 కోట్లు అవుతుంది. కానీ మెగాస్టార్-మహేష్ బాబు సినిమా అంటే 150 కోట్ల మేరకు థియేటర్ నాన్ థియేటర్ బిజినెస్ జరుగుతుంది. పాతిక కోట్ల టేబుల్ ప్రాఫిట్ వుంటుంది.
ఈ విషయమై కొరటాల శివ సన్నిహిత వర్గాలను సంప్రదించగా, మరో 15రోజుల్లో ఏ విషయం క్లారిటీ వస్తుందని, అప్పుడే ఏ సంగతి చెప్పగలమని అన్నారు.